సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటంపై పెద్దదుమారమే రేగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో శనివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. వివరాలిలా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పోలీసులు, ఇతర ఉద్యోగులు నవంబర్ 21 నుంచి 29 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిని భద్రపరిచే విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు.. సీల్ లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటం వివాదానికి కారణమైంది. ఈ విషయమై పోలింగ్ ఏజెంట్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాటిని తెరిచి ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి కౌంటింగ్ పాసుల కోసం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లు ఈ విషయాన్ని గుర్తించి, ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ ఆఫీ సర్ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన.. లాఠీ చార్జ్
ఆందోళనకారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్డీఓ అనంతరెడ్డి చాంబర్ నుంచి మరో గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ టి నుంచి డోర్‌ను బలంగా బాదారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచె ప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల్లో ఫలితాల సమయంలోనూ అధికారులు ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత రిటర్నింగ్ అధికారి కూడా ఆయనే కావడంతో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మ«ధ్య తోపులాట చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
ఆర్డీఓ కార్యాలయానికి కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళీకేరీ రాత్రి 10.30 గంటలకు ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్నారు. బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు, బాక్స్‌లను భద్రపరిచిన విధానంపై ఆరా తీశారు. ఈ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల ఏజెంట్లు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంపై మీకెంత నమ్మకం ఉందో మాకూ అంతే ఉంది.
ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకే మేమున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రాగలం’అని చెప్పారు. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసు ముందు బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తోపులాటలో పంబ శ్రీను అనే వ్యకికి చేతికి బలమైన గాయాలు కాగా.. కృష్ణ అనే మరో వ్యక్తి తలకు గాయమైంది. ఆగ్రహించిన ఆందోళనకారులు ఆర్డీఓ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment