
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సర్కారు కట్టుకథలు
ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్‌కు పాలీగ్రాఫ్ పరీక్షతో వాస్తవాలు వెలుగులోకి
కీలక ప్రశ్నలకు జవాబులు రాబట్టిన ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు
నిందితుడు నేరం చేసినట్లు నిర్థారణ కాలేదని నివేదికలో వెల్లడి
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి నిప్పు లాంటి నిజాలు బయటకొస్తున్నాయి. గతేడాది జూలై 21వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే.. ఫైళ్లు దహనం చేశారంటూ సీఎం చంద్రబాబు సర్కారు చేసిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జి.గౌతమ్‌తేజ్‌కు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడైంది.
అతడే నేరం చేశాడని నిరూపించలేమని అందులో పేర్కొన్నారు. దీంతో ఇదంతా కావాలని చేసిన సంఘటనగా ప్రభుత్వ వ్యవస్థలతో చిత్రీకరించేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రలు బెడిసికొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన కూటమి ప్రభుత్వం మదనపల్లె ఘటనలో మాత్రం డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆగమేఘాలపై హెలికాప్టర్లో ఘటనాస్థలానికి పంపి ఏదో జరిగిపోయిందంటూ హంగామా చేసింది.
గౌతమ్‌తోపాటు అప్పటి ఆర్డీవో మురళి, మరికొందరు కలసి కార్యాలయానికి నిప్పు పెట్టారని, భూములకు సంబంధించిన ఫైళ్లను దహనం చేశారంటూ ఆరోపించింది. ఈ ఘటనపై తొలుత అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సెక్షన్లు, కేసు దర్యాప్తు తీరును మార్చేశారు.
నాలుగు ప్రశ్నలు..
ఈ కేసు మొత్తం గౌతమ్‌తేజ్ చుట్టూ తిరిగింది. కుట్ర కోణం ఉందనే అనుమానంతో సీఐడీ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు చేయించారు. తెరవెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్ర ఏమిటి? అనే వాటిని వెలుగులోకి తేవాలని భావించారు. ఓ కేసుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం కీలకమైన పాలీగ్రాఫ్ పరీక్షను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తారు.
సీఐడీ అధికారుల వినతి మేరకు 2024 నవంబర్ 26, 27వ తేదీల్లో అమరావతి ఏపీఎఫ్ఎస్ఎల్ అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్షలను నిర్వహించారు. సాంకేతికంగా నిజాలను రాబట్టేందుకు గౌతమ్‌తేజ్‌కు నాలుగు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది.
అగ్నిప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ తపస్విని ఫోన్ చేసి చెప్పడానికి ముందే మీకు తెలుసా..?
సెక్షన్‌లో నిప్పు పెట్టింది మీరేనా?
కార్యాలయంలో ప్రమాదం సృష్టించడానికి ఎవరితోనైనా కలసి ఇలా చేశారా?
అగ్ని ప్రమాదానికి కారణాలను దాచి పెడుతున్నారా?
అనే నాలుగు ప్రశ్నలకు ‘కాదు..’ అని గౌతమ్‌తేజ్ సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో ప్రమాదంలో కుట్ర కోణం లేదని, తెర వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఇందులో భూముల వ్యవహారం కూడా లేదని తేలిపోయింది. అరెస్టు సమయంలో గౌతమ్‌తేజ్ నుంచి సేకరించిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు మినహా ఈ కేసులో నేర నిరూపణకు ఇతర ఆధారాలేవీ లేవని అతడికి బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానం సైతం పేర్కొంది.
వ్యవస్థలతో దుష్ప్రచారం..
మదనపల్లె ఫైల్స్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పదేపదే అబద్ధాలు వల్లె వేశారు. ప్రమాదం జరిగిన మర్నాడు నాటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లను హెలికాప్టర్లో మదనపల్లెకు హుటాహుటిన పంపారు. కనీసం దర్యాప్తు కూడా జరగక ముందే ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్ అని నాడు డీజీపీ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సెక్షన్లను మార్చడంతో కేసు దర్యాప్తు తీరు పూర్తిగా మారిపోయింది.
వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కేసుల నమోదుతో వేధింపులకు గురి చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీలు సైతం వెబ్‌సైట్‌లో మాయం చేశారు. ఇక రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఏకంగా మదనపల్లెలో మకాం వేసి అణువణువూ గాలించినా ఫలితం శూన్యం. వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులు, ఉద్యోగులు, అధికారులను సీఐడీ రోజుల తరబడి విచారించింది. సీఐడీతోపాటు రెవెన్యూ, పోలీసు, ఫైర్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులను మదనపల్లెలో మోహరించింది.
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షగట్టి విష ప్రచారం..
ఈ అగ్ని ప్రమాదం ఘటనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు పదేపదే విష ప్రచారం చేశారు. మదనపల్లెలో ప్రభుత్వ భూములను దోచుకున్నారంటూ తప్పుడు ఆరోపణలతో బురద చల్లారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేకున్నా మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పెద్దిరెడ్డి మద్దతుదారులను అక్రమ కేసులతో వేధించారు.
ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోగా, ఎల్లో మీడియా దీనికి వంత పాడింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక! అంటూ తప్పుడు కథనాలను వండి వార్చింది. పచ్చ మీడియాలో ఏది రాస్తే పోలీసులు దాన్నే పాటించారు. విషపూరిత కథనాలను ప్రచురించిన రోజే నేతల నివాసాల్లో సోదాలు జరిగేవి.
Comments
Please login to add a commentAdd a comment