జగన్నాథుని అమూల్య సంపద తరలింపు పూర్తి
పురీ: పురీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలింపు గురువారం పూర్తయింది. రత్న భండార్ లోపలి గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. చెక్క, ఇనుప అల్మారాలు, భోషాణాలు తదితర ఏడింటిలో ఉన్న వీటిని స్ట్రాంగ్ రూంకు మార్చేందుకు ఏడు గంటలు పట్టిందని ఆలయ ప్రధాన అధికారి అరబింద చెప్పారు. అనంతరం రత్న భండార్‌తోపాటు స్ట్రాంగ్ రూంకు కూడా నిబంధనలను అనుసరించి తాళం, సీల్ వేసి తాళం చెవులను కలెక్టర్‌కు అందజేశామన్నారు.
రత్న భండార్ లోపలి భాగంలోని అమూల్య సంపదను తాము పరిశీలించామని సూపర్‌వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. రత్న భండార్‌కు అవసరమైన మరమ్మతులను భారత పురావస్తు శాఖ చేపట్టనుందని, ఆ తర్వాతే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అభరణాలు, ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరీ రాజవంశీకుడు దిబ్య సింఘ దేబ్ వివరించారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉన్నదీ లేదని సర్వేలోనే తేలుతుందన్నారు.
అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియను వీడియోలో చిత్రించినట్టు పురీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉంటుందని ఎస్‌పీ పినాక్ మిశ్రా చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాములు పట్టేవాళ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. రత్నభండార్ లోపల రక్షణగా పాము ఉందన్న వార్తలపై స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు సువేందు మాలిక్ స్పందిస్తూ...అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment