అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలన్న విధానం విదేశీ విద్యార్థుల పాలిట పట్ల శాపంగా మారుతోంది. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ‍్యంలో అమెరికన్లతోనే అక్కడి ఉద్యోగాల భర్తీకి ఆ దేశ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ దాకా పరిశీలిస్తే... అమెరికా పౌరసత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ‘వర్క్ ఆథరైజేషన్’ ఉన్న వారినే అక్కడి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 19 శాతం పెరిగింది.
వీసా నిబంధనల ప్రభావం కారణంగా అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విదేశీవిద్యార్థుల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రెండున్నర కోట్ల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2017లో 55 శాతం అమెరికా కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. 2018లో అది 47 శాతానికి పడిపోయింది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతమున్న విధానం మేరకు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యమున్న వలసదారులు కాని వారిని (నాన్ ఇమ్మిగ్రెంట్స్) కూడా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకునేందుకు హెచ్ 1బీ కేటగిరి అనుమతిస్తోంది. ఇది మూడేళ్ల వరకు చెల్లుబాటు కావడంతో పాటు మళ్లీ పొడిగించేందుకు అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్టు వెల్లడైంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, వర్క్ పర్మిట్లు పొందుతున్న వారి సంఖ్య మాత్రం దిగజారినట్టు తెలుస్తోంది.
2016 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,14,503 హెచ్ 1బీ వీసాలు అనుమతించగా, 2017లో అది 1,08,101కు పడిపోయింది. వీరిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారి సంఖ్య 52,002 నుంచి 45,405కు తగ్గిపోయింది. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. 200717 మధ్య కాలంలో ఈ వీసాల కోసం అమెరికా పౌర, వలస సేవా సంస్థ (యూఎస్‌సీఐఎస్)కు 22 లక్షల మంది ఇండియన్లు దరఖాస్తు చేసుకోగా.. 3,01,000 మందితో చైనీయులు రెండోస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment