కేప్ కార్నివాల్ (అమెరికా): ఆదివారం తెల్లవారుజామునే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో కొత్త మిత్రులు సందడి చేశాయి. స్టేషన్ కమాండర్, ఇటలీకి చెందిన ల్యూకా పార్మిటానో ఓ పెద్ద రోబో చెయ్యిని వినియోగించి వాటిని కేంద్రంలోకి తీసుకొచ్చి సాదరస్వాగతం పలికారు. ఇంతకీ ఈ మిత్రులు ఎవరో చెప్పలేదు కదా..! ఓ స్మార్ట్ రోబో, కండలుదిరిగిన పెద్దపెద్ద ఎలుకలు, క్రిమిసంహారక పురుగులే..!‘స్పేస్ ఎక్స్’అనే అమెరికా సంస్థే వీటిని ఐఎస్‌ఎస్‌కి చేర్చింది. దీనికోసం కేప్ కార్నివాల్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రెండు అంతరిక్ష నౌకల సాయంతో 3 రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
ఎలుకలు, పురుగులే కదా.. వీటి బరువు కేవలం ఓ రెండు, మూడు కిలోలు ఉంటాయని అనుకుంటే పొరపాటే. వీటి బరువు దాదాపు 3 టన్నులు.. అంటే 2,720 కిలోగ్రాములు అన్నమాట. కొత్త మిత్రుల్లో ఓ 40 ఎలుకలు ఉన్నాయి. వీటిని కండలు, ఎముకల పరీక్షల కోసం అక్కడకు పంపించారు. వీటిలో జన్యుపరంగా తయారు చేయబడిన బాహుబలి లాంటి ఎలుకలు 8 ఉన్నాయి. వీటి బరువు సాధారణ ఎలుకల కంటే రెట్టింపు ఉంటుంది.
అలాగే లక్షా 20 వేల నులి పురుగులు ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో క్రిమిసంహారకం కోసం అక్కడకు పంపించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతతో పనిచేసే రోబో అయితే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోగలదు. దీని పేరు సిమన్. దీనిని వ్యోమగాముల భావాలను అర్థం చేసుకోవడానికి పంపించారు. ఇక ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఆరుగురు వ్యోమగాముల కోసం నాసా క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment