గురుడి చందమామ యూరోపా.. | Nasa And Spacex Set For Europa Clipper Launch On October 14th | Sakshi
Sakshi News home page

గురుడి చందమామ యూరోపా..

Published Sat, Oct 12 2024 6:58 PM | Last Updated on Sat, Oct 12 2024 7:17 PM

Nasa And Spacex Set For Europa Clipper Launch On October 14th

మంచు లోకంలో మహా సముద్రం!

జీవులకు ఆవాసయోగ్యమేనా?

అధ్యయనానికి నాసా ‘యూరోపా క్లిప్పర్’ మిషన్ 

ఈ నెల 14న ఫ్లోరిడా నుంచి ప్రయోగం 

2030లో గురుడి కక్ష్యలోకి అంతరిక్ష నౌక 

ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు

“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?

వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.

నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!
జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.

మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.

భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! 

యూరోపా... మరో జల ప్రపంచం! 
జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.

గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).

అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.

క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!
గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. 

బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.

అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.

రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.

యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.
- జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement