బోస్టన్: మన సౌర వ్యవస్థ ఆవల మరో కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రహం మనకు సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల కోసం అన్వేషణ సాగిస్తున్న టెస్ (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) సాయంతో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ శాటిలైట్ లాంచ్ చేయగా.. ఇప్పటివరకు మన సౌర వ్యవస్థ ఆవల 3 గ్రహాలను కనుగొంది. తాజా గ్రహం పేరు హెచ్‌డీ 21749బీ కాగా.. పై మెన్సె బీ, ఎల్‌హెచ్‌ఎస్ 3844బీ ఇంతకుముందు కనుగొన్న మరో 2 గ్రహాలు. ఈ 3 గ్రహాల్లోకెల్లా ప్రస్తుత గ్రహమే అధిక కక్ష్య కాలాన్ని కలిగి ఉంది.
ఈ గ్రహం మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 36 రోజుల సమయం తీసుకుంటుంది. సూపర్ ఎర్త్‌గా భావించే ‘పై మెన్సె’గ్రహం తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 6.3 రోజుల సమయం తీసుకుంటుండగా.. ఎల్‌హెచ్‌ఎస్ 3844బీ తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 11 గంటల సమయమే తీసుకుంటుంది. తాజా గ్రహంపై ఉష్ణోగ్రత 300 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉన్నట్లు తెలిపారు. ప్రకాశవంతమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల్లోకెల్లా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఇదేనని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ డయానా చెప్పారు. భూమి కంటే ఈ గ్రహం సైజు 3 రెట్లు ఎక్కువ కాగా.. బరువులో 23 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఈ గ్రహం నివాసయోగ్యమైనది కాకపోవచ్చని అన్నారు. మరో గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లనూ పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ దీన్నీ ధ్రువీకరించినట్లయితే టెస్ కనుగొన్న భూమి ఆకారంలో ఉన్న మొదటి గ్రహం ఇదే కానుంది.
Comments
Please login to add a commentAdd a comment