
అంతరిక్ష ‘మృగం’.. దాటిపోతోంది...
సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న ‘2014 హెచ్‌క్యూ124’ అనే ఓ భారీ గ్రహశకలం ఆదివారం భూమికి కాస్త సమీపంలో నుంచే దూసుకుపోనుంది. ప్రస్తుతం సెకనుకు 14 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న ఈ గ్రహశకలం ఉదయం 11:26 గంటలకు భూమిని దాటిపోనుందని హైదరాబాద్‌లోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ రఘునందన్ కుమార్ వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్ ప్రతి 286 రోజుల కోసారి సూర్యుడిని చుట్టి వస్తోందని, ఇది మళ్లీ 2017 నవంబర్ 13న భూమికి సమీపంలోకి రానుందన్నారు. నాసా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. చంద్రుడి కన్నా మూడు రెట్ల దూరంలో సుమారు 12.50 లక్షల కి.మీ. దూరంలో నుంచే ఈ గ్రహశకలం భూమిని దాటిపోతుందని, దీనివల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పూ లేద న్నారు. కాగా, ఫుట్‌బాల్ మైదానమంత సైజు(సుమారు 400 మీటర్లు) ఉన్న ఈ గ్రహశక లాన్ని శాస్త్రవేత్తలు ఓ క్రూరమృగంగా పోలుస్తున్నారు.
ఎందుకంటే.. ఇది భూమిపై పడితే గనక.. ఒక అణుబాంబుతో సమాన మైన శక్తి వెలువడి ఓ నగరాన్నే సమూలంగా తుడిచిపెట్టేస్తుందట. దీనిని 2013 ఏప్రిల్ 23నే నాసా శాస్త్రవేత్తలు నియోవైజ్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. అంటే అంతకుముందు అసలు ఇలాంటి గ్రహశకలం ఒకటి ఉందన్న సంగతే ఎవరికీ తెలియదన్నమాట. అందుకే దీనిని దాగి ఉన్న మృగం (బీస్ట్)గా అభివర్ణిస్తున్నారు. అప్పుడప్పుడూ భూమి సమీపంలోకి వచ్చే ఇలాంటి ప్రమాదకర గ్రహశకలాలు 1,484 వరకూ ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా.