
న్యూయార్క్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!!
అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పులు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు.
భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కన్పించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్ మానవుల హవాయే నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment