తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!
వాషింగ్టన్: అంగారకుడి సమీపం నుంచి అక్టోబరు 19న సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క దూసుకుపోయిన సందర్భంగా మార్స్ గగనతలం అంతా పసుపువర్ణపు వెలుగులతో నిండిపోయిందట. గంటకు వేలాది తారలు నేల రాలినట్లుగా ఉల్కాపాతం సంభవించిందట.
వీటితో పాటు అంగారకుడి వాతావరణంలోని అయనోస్పియర్‌లోకి ప్రవేశించిన తోకచుక్క అవశేషాల వల్ల విద్యుదావేశ కణాలతో కూడిన కొత్త అయాన్ల పొర కూడా ఏర్పడిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం వెల్లడించింది. ఒక గ్రహంపై వాతావరణంలో తోకచుక్కల వల్ల ఏర్పడిన ఇలాంటి అయాన్ల పొరను గుర్తించడం ఇదే తొలిసారని తెలిపింది.
అలాగే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క కేంద్రభాగం, అయాన్ల పొరల సమాచారాన్ని నాసా మావెన్ ఉపగ్రహం, ఈసా ఉపగ్రహాలు సేకరించాయని నాసా పేర్కొంది. ఈ తోకచుక్క కేంద్ర భాగం ఇంతకుముందు ఊహించిన కంటే చిన్నగా 2 కి.మీ. సైజు మాత్రమే ఉందని, ఈ తోకచుక్క నుంచి టన్నుల కొద్దీ ధూళి అంగారకుడి వాతావరణంలోకి విడుదలైందనీ నాసా వెల్లడించింది.