Siding Spring
-
తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!
వాషింగ్టన్: అంగారకుడి సమీపం నుంచి అక్టోబరు 19న సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క దూసుకుపోయిన సందర్భంగా మార్స్ గగనతలం అంతా పసుపువర్ణపు వెలుగులతో నిండిపోయిందట. గంటకు వేలాది తారలు నేల రాలినట్లుగా ఉల్కాపాతం సంభవించిందట. వీటితో పాటు అంగారకుడి వాతావరణంలోని అయనోస్పియర్లోకి ప్రవేశించిన తోకచుక్క అవశేషాల వల్ల విద్యుదావేశ కణాలతో కూడిన కొత్త అయాన్ల పొర కూడా ఏర్పడిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం వెల్లడించింది. ఒక గ్రహంపై వాతావరణంలో తోకచుక్కల వల్ల ఏర్పడిన ఇలాంటి అయాన్ల పొరను గుర్తించడం ఇదే తొలిసారని తెలిపింది. అలాగే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క కేంద్రభాగం, అయాన్ల పొరల సమాచారాన్ని నాసా మావెన్ ఉపగ్రహం, ఈసా ఉపగ్రహాలు సేకరించాయని నాసా పేర్కొంది. ఈ తోకచుక్క కేంద్ర భాగం ఇంతకుముందు ఊహించిన కంటే చిన్నగా 2 కి.మీ. సైజు మాత్రమే ఉందని, ఈ తోకచుక్క నుంచి టన్నుల కొద్దీ ధూళి అంగారకుడి వాతావరణంలోకి విడుదలైందనీ నాసా వెల్లడించింది. -
సైడింగ్ స్ప్రింగ్ సైజు పావు కిలోమీటరే!
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్వో వీటిని క్లిక్‌మనిపించింది. దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క తలభాగం కిలోమీటరు సైజు లేదని, పావు కి.మీ. మాత్రమే ఉందని తేలింది. అలాగే ఈ తోకచుక్కను అన్నింటికంటే ముందుగా మార్స్‌పై ఉన్న నాసా ఆపర్చునిటీ రోవర్ ఫొటో తీసింది. సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన ఓ తోకచుక్కను ఇతర గ్రహంపై నుంచి ఫొటో తీయడం ఇదే తొలిసారి. -
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!
వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహాలకు మరో పనిపడింది. అరుణ గ్రహానికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ‘సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1)’ తోకచుక్కను అవి పరిశీలించనున్నాయి. మన జీవితకాలంలో ఒక్కసారే వచ్చే ఈ తోకచుక్క.. ఈ నెల 19న అంగారకుడికి కేవలం 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే కావడం గమనార్హం. ఇంత సమీపంలోంచి వెళుతున్నందున.. అంగారకుడి వాతావరణంపై ‘సైడింగ్ స్ప్రింగ్’ చూపే ప్రభావంతో పాటు ఆ తోకచుక్క పరిస్థితిని, నిర్మాణాన్ని పరిశీలించేందుకు అవకాశం కలుగనుంది.