మంత్రి కేటీఆర్ నుంచి పురస్కారం అందుకుంటున్న కలెక్టర్ హరీష్
సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో అత్యుత్తమ పురోగతి కనబర్చిన మన జిల్లాకు అవార్డు వరించింది. ఈమేరకు ‘టీఎస్–ఐపాస్ అవార్డు’ను ఇన్ చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్, జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, కామర్స్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్–ఐపాస్ ఐదు వసంతాల వేడుకల్లో భాగంగా వీరిద్దరూ అవార్డు అందుకున్నారు. ఐదేళ్ల కింద అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల సంఖ్య ఆధారంగా అన్ని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు.
అత్యధికంగా పరిశ్రమలు ఉన్న తొలి జాబితాలో నిలిచిన మన జిల్లా.. సకాలంలో అనుమతుల జారీ, టీఎస్–ఐపాస్ విధానం అమలు, పారిశ్రామిక ప్రగతిలో మెరుగైన పురోగతి కనబర్చింది. ఇందుకు గుర్తింపుగా జిల్లాకు టీఎస్–ఐపాస్ అవార్డు లభించగా.. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్, కన్వీనర్‌గా కొనసాగుతున్న డీఐసీ జీఎం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు లభించడంపై వారిద్దరు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల అనుమతుల జారీలో భాగస్వాములైన అన్ని శాఖల సహకారంతోనే ఇది సాధ్యపడిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment