షాబాద్: రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో రూ.575 కోట్ల పెట్టుబడితో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీ ఏర్పాటుకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యో గ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకోవడం జరిగిందని, వారి అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
రంగారెడ్డి జిల్లాలోపెట్టుబడులు అభినందనీయం
‘తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నిజానికి అక్కడ సహజ వనరులు తక్కువ. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలబడింది.
ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తి, నాణ్యత అంశంలో అందరికంటే ముందుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో తమ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జపాన్ వస్తువు ఉంటుంది. అలాంటి దేశానికి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టడం అభినందనీయం..’ అని కేటీఆర్ చెప్పారు.
మరిన్ని పెట్టుబడులకు సహకరించండి
‘స్థానిక నాయకులు, ప్రజల చొరవతో ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. టెక్స్‌టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెళ్లి ఎదుగుతుంది..’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరించాల్సిందిగా జపాన్ కాన్సులేట్‌ను కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment