రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా గ్రూప్ నెలకొల్పిన ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇదే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా గ్రూప్ నెలకొల్పిన ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటని తెలిపారు. త్వరలో రైల్ కోచ్‌ల తయారీ, రవాణాకు సిద్ధమవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్ కోచ్‌ల తయారీని సుసాధ్యం చేసిన మేధా బృందాన్ని అభినందిస్తూ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పంచుకున్నారు.
ఈ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీకి కొండకల్‌లో మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. వేయికోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన ఫ్యాక్టరీలో స్థానికంగా 2,200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ లోకోమోటివ్ డిజైనింగ్‌లో పేరొందిన మేధా సర్వో గ్రూప్ భారతీయ రైల్వేకు అతిపెద్ద ప్రొపల్షన్ సరఫరాదారుగా ఉంది. కొండకల్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో కోచ్‌లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ తదితరాల తయారవుతాయి. ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్‌ల తయారీ సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment