వెల్‌స్పన్‌ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ | KTR Inaugurates Welspun Manufacturing Unit At TSIIC | Sakshi
Sakshi News home page

వెల్‌స్పన్‌ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Published Sat, Jul 25 2020 4:23 PM | Last Updated on Sat, Jul 25 2020 5:34 PM

KTR Inaugurates Welspun Manufacturing Unit At TSIIC - Sakshi

సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. శనివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం. ఈ కంపెనీ రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా స్ధానిక యువతకు ఉద్యోగవకాశాలు కల్పించబడతాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 3600 ఎకరాల్లో ఇక్కడ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చందనవెళ్లి పారిశ్రామిక పార్క్‌కి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ చొరవతో షాబాద్ మండలం చందనవెళ్లిలో ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు అయ్యింది. ఇక్కడి ప్రజలు కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తు ఆశదీపంగా కనిపిస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ నేడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికెళ్లినా తెలంగాణకు పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అందరూ దీనిని మన కంపెనీ గా భావించాలి. పారిశ్రామిక అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. (కరుణించిన కేసీఆర్‌)

రూ.2వేల కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటు చేయటం, రానున్న కాలంలో మరిన్ని సంస్థలు రానుండటంతో వచ్చే 5 ఏళ్ల కాలంలో షాబాద్ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోనూ అతి పెద్ద ఫార్మా సిటీ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఎల్‌సీ మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి,డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి , జీవన్ రెడ్డి, బాల్క సుమన్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్‌లు బాల మల్లు, నాగేందర్ గౌడ్, కలెక్టర్ అమయ్ కుమార్, కంపెనీ సీఈఓ గోయెంక్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement