
కొత్త విధానాలతో ముందుకు సాగండి
కేంద్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి విజయానంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి విజయానంద్ అన్నారు. టీఎస్ ఐపార్డ్‌లో ఆదివారం జరిగిన మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైనందున సరికొత్త విధానాలతో ముందుకు సాగాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో రోడ్‌మ్యాప్ కోసం నిపుణులతో సదస్సును నిర్వహించడం శుభపరిణామమన్నారు. కేరళలో పంచాయతీ వ్యవస్థల తీరుతెన్నులను పరిశీలించేందుకు ఎమ్మెల్యేల బృందాన్ని పంపాలని కోరారు.
ఉత్తమ విధానాలను అనుసరిస్తాం: కేటీఆర్
గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి, అత్యుత్తమ విధానాలను తాము అనుసరిస్తామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ - పంచాయతీల ఏర్పాటు ద్వారా పౌరసేవలను అందించబోతున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపుద్వారా వారిలో విశ్వాసాన్ని పెంచగలిగామన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.