మీటర్ రీడింగ్ పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకుంటున్న కలెక్టర్ మురళీధర్‌రెడ్డి (పాతచిత్రం)
కరెంటు పోయి ఐదారు గంటల పైనే అయ్యింది. సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవ్వరూ పలకడం లేదు. ఈ రాత్రికి ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనా..! గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదు. కరెంటు స్తంభం పడిపోతుందని వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. లైన్‌మన్‌కు చెబితే మూడు ఊళ్లవతల ఉన్నాం. నాకు మీ ఒక్క ఊరే అనుకుంటున్నారా? పరుగెత్తుకు వచ్చేయడానికి అంటాడు. జిల్లాలో ఏ పల్లె, పట్టణ వాసిని పలకరించినా విద్యుత్ పరంగా ఇటువంటి సమస్యలనే ఏకరువు పెడతారు. గడచిన ఐదేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఇకమీదట ఈ పరిస్థితి ఎదురు కాదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు పరిష్కారం లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటారా! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టాలెక్కిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్న ఎనర్జీ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషించనున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : పదిహేనేళ్ల కిందట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉండగా జిల్లాలో 300 మంది లైన్‌మన్లను నియమించారు. ఆ తరువాత అడపాదడపా తీసుకున్నా జిల్లాలో ఉన్న ఖాళీలకు, భర్తీ చేసిన పోస్టులకు ఎక్కడా పొంతన లేని పరిస్థితి. అప్పటి నుంచీ జిల్లాలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం ఒక ప్రహసనంలా సాగుతూ వస్తోంది. మళ్లీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ఒక లైన్‌మన్‌ను నియమించనుంది. ఇప్పటికే లైన్‌మన్‌లున్న వాటిని మినహాయించి, మిగిలిన అన్నిచోట్లా వీరి నియామక ప్రక్రియను అధికార యంత్రాంగం చురుకుగా సాగిస్తోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపాన ఉన్న ఏపీ ఈపీడీసీఎల్ ప్రాంగణంలో లైన్‌మన్‌ల నియామనికి అర్హత నిర్ధారణ పరీక్షలు ఇప్పటికే నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి సుమారు 200 మంది వివిధ కేడర్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలి దశను శనివారం పూర్తి చేశారు. సైకిల్ తొక్కడం, స్తంభం ఎక్కడం, దిగడం, మీటర్ రీడింగ్ వంటి వాటిపై పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియనంతటినీ వీడియో తీసి ఏరోజుకారోజు నేరుగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. ఏపీఈపీడీసీఎల్ నుంచి వచ్చిన సీజీఎం సింహాద్రి, జీఎంహెచ్‌ఆర్ కోటేశ్వరరావు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ పోస్టులకు 1,853 మంది దరఖాస్తు చేసుకోగా 1,405 మంది హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లావ్యాప్తంగా 583 మంది ఎనర్జీ అసిస్టెంట్లు (లైన్‌మన్లు) గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్నారు. వీరికి నెలకు రూ.15 వేల జీతం ఇస్తారు.
గతానికి భిన్నంగా.. పారదర్శకంగా..
గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఒక పోస్టు కావాలంటే అది కాంట్రాక్ట్ అయినా ఔట్‌సోర్సింగ్ అయినా సరే లక్షల రూపాయల ముడుపులు కట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి. ఇటువంటి నియామకాల్లో తెలుగు తమ్ముళ్లు, జన్మభూమి కమిటీల హవానే నడిచింది. నేరుగా బేరాలాడుకుని పోస్టులు అమ్మేసుకున్న ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. చివరకు సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును కూడా అప్పట్లోæ టీడీపీ ప్రజాప్రతినిధులు ఐదారు లక్షలకు అమ్మేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పనవసరం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ నియామకమైనా పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరైనా సరే.. నియామకాల్లో జోక్యం చేసుకోరాదని సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడే జగన్ చెప్పారు.
ఈ నియామకాల్లో కూడా అదే విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో నైపుణ్యం ఉన్న వారికే న్యాయం జరుగుతుందనే నమ్మకం అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు లభించింది. పైసా లంచం ఇవ్వనవసరం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే రూ.15 వేల జీతంతో వీరు ఉద్యోగంలో చేరనున్నారు. ఏపీఎస్‌ఈబీ ఉన్నప్పుడు గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను అదే పర్యవేక్షించేది. బోర్డు విభజన జరిగి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏర్పాటయ్యాక గ్రామ పంచాయతీలే వీధిదీపాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. కొత్తగా వచ్చే ఎనర్జీ అసిస్టెంట్లు గ్రామాల్లో వీధిదీపాలు సహా విద్యుత్ పరంగా తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే వీరు విధులు నిర్వర్తించనున్నా ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షణలోనే ఉంటారు.
ఇక నాణ్యమైన విద్యుత్ సేవలు
ఈ నియామకాలు జరిగాక జిల్లా అంతటా విద్యుత్ వినియోగదారులకు పూర్తి నాణ్యమైన సేవలు అందుతాయి. ఇంతవరకూ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒకేసారి ఇంతమంది ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకోవడం బహుశా ఇదే ప్రథమం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా వీడియో కవరేజ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
– చింతా సత్యనారాయణరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీ ఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment