ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్న ఆనంద్
చంద్రగిరి(తిరుపతి జిల్లా): ‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే... అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం..’ అని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ‘హెల్తీ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు.
చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీలో ఛండీగఢ్, జమ్ము–కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, కేరళకు చెందిన 49 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు 47మంది, చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన 48మంది ప్రతిని«దులు పర్యటించారు.
గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్, వెల్‌నెస్ సెంటర్ ఎస్‌డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలతోపాటు డిజిటల్ క్లాసులు, ట్యాబుల ద్వారా విద్యాబోధన ఒక అద్భుతమని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొండవాడ పంచాయతీలో పర్యటించిన బృందం వెంట ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment