linemen
-
వృత్తిధర్మం కోసం ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
-
కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్!
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్): అది విద్యుత్ శాఖకు చెందిన సబ్‌స్టేషన్ స్థలం.. దానిలో షెడ్లు నిర్మించడానికి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నించారు.. ఇదేమిటని అడ్డుకున్న విద్యుత్ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ తీరుతో మండిపడ్డ విద్యుత్ సిబ్బంది పట్టణం మొత్తానికి కరెంట్ కట్ చేశారు, జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్‌బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో చిరు వ్యాపారులు షెడ్లు కోల్పోయారు. వారికి స్థానిక సబ్‌స్టేషన్ స్థలంలో షెడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు నిర్ణయించారు. సోమవారం సబ్‌స్టేషన్ ఆవరణలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ రామ్మూర్తి, లైన్మెన్లు అక్కడికి చేరుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ స్థలంలో షెడ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటూ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని విద్యుత్ లైన్మెన్లు పాషా, సృజన్ వీడియో తీయడం మొదలుపెట్టారు. అది చూసిన కౌన్సిలర్లు రెవెల్లి మహేశ్, వేల్పుల సుధాకర్, 11వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల స్వర్ణలత భర్త, ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుడిగా పేరున్న లక్ష్మణ్ తదితరులు ఆగ్రహంతో లైన్‌మన్లపై దాడి చేశారు. విద్యుత్ సరఫరా నిలిపేసి నిరసన తమ ఉద్యోగులపై దాడికి నిరసనగా విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది చెన్నూర్‌లో సుమారు 6 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంచిర్యాల– చెన్నూర్ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. -
అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..
లైన్ ఉమెన్ నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాతపరీక్ష సహా స్తంభాలు ఎక్కే పరీక్షల్లో (పోల్ క్లైంబింగ్ టెస్టు) విజయం సాధించి అన్ని విధాలుగా సమర్థతను నిరూపించుకున్నప్పటికీ..వారికి ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి వంటి రక్షణ రంగాల్లో పెద్దపీట వేస్తూ మహిళాభ్యున్నతికి పాటుపడుతుంటే..మరో వైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)మాత్రం ఇప్పటికీ మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరు వల్ల లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాధించిన వాంకుడోతు భారతి, బి.శిరీషలకు ఏడాది కాలంగా నిరీక్షణ తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్ 28న 2500 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫాంలో మహిళలకు ఆప్షన్ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్ధిపేటకు చెందిన శిరీష సహా మరో 30 మంది మహిళలు తమ భవితవ్యంపై ఆందోళన చెందారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 34 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 డిసెంబర్ 15 వీరికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే (భారతి, శిరీష)అర్హత సాధించారు. అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్టు నిర్వహించి.. మహిళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 23న వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్ పవర్ ఇనిస్టిట్యూట్‌లో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరూ ఎనిమిది మీటర్ల ఎత్తున్న విద్యుత్ స్తంభాన్ని ఈజీగా ఎక్కి, పురుషులకు తామేమాత్రం తీసిపోబోమని నిరూపించారు. అంతేకాదు సంస్థలో లైన్ ఉమెన్ ఉద్యోగానికి అర్హత సాధించిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వక పోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులోని తొమ్మిదో నెంబర్ సింగిల్ బెంచి వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు. అయితే డిస్కం మాత్రం కోర్టు ఆదేశాలు వచి్చన తర్వాతే ఆర్డర్స్ ఇస్తామని చెబుతోంది. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? మాది సిద్ధిపేట జిల్లా మర్కుకు మండలం గణేష్‌పల్లి గ్రామం. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలే. 2015లో అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎల్రక్టీషియన్ ట్రేడ్‌లో చేరాను. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ అభ్యంతరం కూడా చెప్పారు. అమ్మాయివి ఈ కోర్సు ఎందుకమ్మా...? మరేదైనా కోర్సు తీసుకోవచ్చు కదా! అని సూచించారు. కానీ నేను వినలేదు. పట్టుబట్టి అదే కోర్సులో చేరి పాసయ్యాను. 2019లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసేందుకు వెళ్లితే అందు లో ఫీమేల్ ఆఫ్షన్ లేకపోవడం ఆందోళన కలిగింది. కొంత మంది యువతులం కలిసి హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో రాతపరీక్ష సహా పోల్ క్లైంబింగ్ కూడా పూర్తి చేశాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలో?. – బి.శిరీష, సిద్ధిపేట వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి మాది జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సపీమంలోని సుకారిగడ్డ తండా. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో 2015లో ఇల్లందు ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ కోర్సులో చేరాను. నాన్ లోకల్ కేటగిరిలో డిస్కంకు దరఖాస్తు చేశాను. రాత పరీక్ష కోసం వరంగల్‌లోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. 90 మంది పురుష అభ్యర్థుల మధ్య నేను ఒక్కతినే. వారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. అయినా నిరుత్సాహ పడలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో రాత పరీక్ష, స్తంభం ఎక్కడం వంటి పరీక్షల్లోనూ నెగ్గాను. ఇప్పటికే మూడేళ్లైంది. అయినా ఎదురు చూపులు తప్పడం లేదు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి. – వాంకుడోతు భారతి, జనగాం జిల్లా -
ప్రాణాలకు తెగించి.. పేసర్ బిగించి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఈ ఫొటో చూస్తే ఎలాంటి ఆధారం లేని నిచ్చెనను కింద ముగ్గురు పట్టుకోగా.. పైకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ లైన్‌పై పనిచేస్తుండటం సర్కస్ ఫీట్లా అనిపిస్తోంది కదా! కానీ ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు తమ విధి నిర్వహణలో మామూలేనని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బస్టాండ్ వెనుక వైపు ప్రాంతంలో ఎస్ఎస్ 86 (100 కేవీ) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్లో సోమవారం పేసర్లు బిగించాల్సి వచ్చింది. అయితే, లైన్ వద్దకు వెళ్లి నిలబడి పనిచేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 12 ఫీట్ల నిచ్చెనను నిటారుగా నిలబెట్టి కింద ముగ్గురు సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత కుమార్ అనే విద్యుత్ కార్మికుడు పైకి ఎక్కి పేసర్లు బిగించాడు. -
చేతులు మారిన రూ.2.50లక్షలు..?
సాక్షి, బేల(అదిలాబాద్): ఓ ప్రైవేట్ లైన్‌మన్ విద్యుత్‌షాక్‌తో ఇటీవల చనిపోయిన ఘటనలో బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకుడొకరు ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి రూ.2.50లక్షలు వసూలు చేశాడని, ఇందుకు సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఒకరు సహకరించారన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు కూడా ‘పైసలుపాయే.. ఆపై కేసు నమోదాయే..’ అని చర్చించుకుంటున్నారు. వీరిచ్చిన రూ.2.50 లక్షలు చేతులు మారాయా..? మారితే ఎవరికి చేరాయి..? డబ్బులిచ్చినా కేసు ఎందుకు నమోదైంది..? అని ఆ శాఖలో తర్జనభర్జన నెలకొంది. బేల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అంతర్రాష్ట్ర రోడ్డు పక్కన ఓ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు వచ్చింది. దీంతో గతనెల 17న చిన్న ట్రాన్స్ఫార్మర్ బిగింపు, మరమ్మతు చేసేందుకు ప్రైవేటు లైన్‌మన్ షేక్ అయ్యూబ్ (22)ను తీసుకొచ్చారు. ఆ సమయంలో విద్యుత్‌షాక్ తగిలి అయ్యూబ్ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం సమయంలో ఓ నాయకుడు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ కలిసి బాధిత కుటుంబం నుంచి పోలీసులకు ఆరుసార్లు ఫిర్యాదు రాయించారు. సంఘటనకు బాధ్యులైన అధికారులను కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ. 2.50లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ఇందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించాలని, మిగిలిన రూ. 50 వేలు కేసుల ఖర్చుల కోసమని నిర్ణయించుకున్నారు. కేసు ప్రారంభంలో పోలీసులు ప్రమాదానికి విలేజ్ వర్కర్ (ఆదివాసీ యువకుడు) కనకే శ్యాం కారణమని పేర్కొంటూ కేసు నెట్టారు. దీంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కేసును తాత్కాలిక విలేజ్ వర్కర్‌పై నెట్టడమేంటని, అమాయకుడిని బలిచేస్తే ఊరుకోబోమని పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదివాసీ నాయకులను సముదాయించారు. ఇటీవల ఆ కేసు నుంచి విద్యుత్ అధికారులను తప్పించి.. విలేజ్ వర్కర్‌పై నెట్టడానికి డబ్బులు వసూలు చేసిన సదరు నాయకుడు ఓ మైనార్టీ నాయకుడితోపాటు బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై సాయన్న సమగ్ర విచారణ చేపట్టి గతనెల 26న ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులతోపాటు విలేజ్ వర్కర్‌ను రిమాండ్ చేశారు. రిమాండ్ అయినవారిలో ఏఈ శంకర్, లైన్ ఇన్స్పెక్టర్ పవార్ సౌలా, జూనియర్ లైన్‌మన్ మనోహర్, విలేజ్ వర్కర్ కనకే శ్యాం ఉన్నారు. ఇలా ముగ్గురు అధికారులపై కేసు కావడంతో డివిజన్ పరిధిలోని విద్యుత్ బృందం తలాకొంత కలిపి ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలంటూ కేసులో మధ్యవర్తిత్వం వహించిన సబ్‌స్టేషన్ ఆపరేటర్‌తో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను సదరు ఆపరేటర్ నాయకుడికి ఇచ్చాడా..? ఒకవేళ నాయకుడికి ఇస్తే వెనక్కి ఎలా తీసుకోవాలి..? అని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. సదరు నాయకుడు అధికారపారీ్టకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరోవైపు బాధిత కుటుంబానికీ రూ.2లక్షలు ఇవ్వలేదని తెలిసింది. మొత్తం డబ్బులను ఆ నాయకుడే నొక్కేశాడా? ఆపరేటర్ నొక్కేశాడా..? తేలాల్సి ఉంద ని విద్యుత్‌శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. -
లైన్‌మేన్ సతాయిస్తుండు!
గండేడ్: వెన్నాచేడ్ సబ్‌స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీప చిన్నవాగు సమీపంలో 10మంది రైతులు కలిసి పొలాలకు నీరు మళ్లించేందుకు ఓ ట్రాన్స్ఫార్మర్ను వేసుకున్నారు. వారంరోజుల కిందట లోఓల్జేజీ సమస్య చెడిపోయింది. రైతులందరూ కలిసి దాన్ని తీసుకెళ్లి మరమ్మతు చేయించి తీసుకొచ్చారు. దానికి తిరిగి కనెక్షన్లు ఇచ్చి కరెంట్ సరఫరా చేయమని ఎన్నిసార్లు లైన్‌మేన్ అచ్చుతారెడ్డిని బతిమాలినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మోటార్లు నడవక పోవడంతో రైతులు సాగుచేసిన పైర్లు ఎండుతున్నాయి. మూగజీవాలకు నీరు లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని మండల ట్రాన్స్ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గ్రామ సచివాలయంలో 583 లైన్మెన్ల నియామకం
కరెంటు పోయి ఐదారు గంటల పైనే అయ్యింది. సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవ్వరూ పలకడం లేదు. ఈ రాత్రికి ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనా..! గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదు. కరెంటు స్తంభం పడిపోతుందని వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. లైన్‌మన్‌కు చెబితే మూడు ఊళ్లవతల ఉన్నాం. నాకు మీ ఒక్క ఊరే అనుకుంటున్నారా? పరుగెత్తుకు వచ్చేయడానికి అంటాడు. జిల్లాలో ఏ పల్లె, పట్టణ వాసిని పలకరించినా విద్యుత్ పరంగా ఇటువంటి సమస్యలనే ఏకరువు పెడతారు. గడచిన ఐదేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఇకమీదట ఈ పరిస్థితి ఎదురు కాదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు పరిష్కారం లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటారా! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టాలెక్కిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్న ఎనర్జీ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషించనున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : పదిహేనేళ్ల కిందట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉండగా జిల్లాలో 300 మంది లైన్మన్లను నియమించారు. ఆ తరువాత అడపాదడపా తీసుకున్నా జిల్లాలో ఉన్న ఖాళీలకు, భర్తీ చేసిన పోస్టులకు ఎక్కడా పొంతన లేని పరిస్థితి. అప్పటి నుంచీ జిల్లాలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం ఒక ప్రహసనంలా సాగుతూ వస్తోంది. మళ్లీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ఒక లైన్‌మన్‌ను నియమించనుంది. ఇప్పటికే లైన్మన్లున్న వాటిని మినహాయించి, మిగిలిన అన్నిచోట్లా వీరి నియామక ప్రక్రియను అధికార యంత్రాంగం చురుకుగా సాగిస్తోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపాన ఉన్న ఏపీ ఈపీడీసీఎల్ ప్రాంగణంలో లైన్మన్ల నియామనికి అర్హత నిర్ధారణ పరీక్షలు ఇప్పటికే నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ సత్యనారాయణరెడ్డి సుమారు 200 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలి దశను శనివారం పూర్తి చేశారు. సైకిల్ తొక్కడం, స్తంభం ఎక్కడం, దిగడం, మీటర్ రీడింగ్ వంటి వాటిపై పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియనంతటినీ వీడియో తీసి ఏరోజుకారోజు నేరుగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. ఏపీఈపీడీసీఎల్ నుంచి వచ్చిన సీజీఎం సింహాద్రి, జీఎంహెచ్ఆర్ కోటేశ్వరరావు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ పోస్టులకు 1,853 మంది దరఖాస్తు చేసుకోగా 1,405 మంది హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లావ్యాప్తంగా 583 మంది ఎనర్జీ అసిస్టెంట్లు (లైన్మన్లు) గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్నారు. వీరికి నెలకు రూ.15 వేల జీతం ఇస్తారు. గతానికి భిన్నంగా.. పారదర్శకంగా.. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఒక పోస్టు కావాలంటే అది కాంట్రాక్ట్ అయినా ఔట్సోర్సింగ్ అయినా సరే లక్షల రూపాయల ముడుపులు కట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి. ఇటువంటి నియామకాల్లో తెలుగు తమ్ముళ్లు, జన్మభూమి కమిటీల హవానే నడిచింది. నేరుగా బేరాలాడుకుని పోస్టులు అమ్మేసుకున్న ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. చివరకు సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును కూడా అప్పట్లోæ టీడీపీ ప్రజాప్రతినిధులు ఐదారు లక్షలకు అమ్మేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పనవసరం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ నియామకమైనా పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరైనా సరే.. నియామకాల్లో జోక్యం చేసుకోరాదని సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడే జగన్ చెప్పారు. ఈ నియామకాల్లో కూడా అదే విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో నైపుణ్యం ఉన్న వారికే న్యాయం జరుగుతుందనే నమ్మకం అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు లభించింది. పైసా లంచం ఇవ్వనవసరం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే రూ.15 వేల జీతంతో వీరు ఉద్యోగంలో చేరనున్నారు. ఏపీఎస్ఈబీ ఉన్నప్పుడు గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను అదే పర్యవేక్షించేది. బోర్డు విభజన జరిగి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏర్పాటయ్యాక గ్రామ పంచాయతీలే వీధిదీపాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. కొత్తగా వచ్చే ఎనర్జీ అసిస్టెంట్లు గ్రామాల్లో వీధిదీపాలు సహా విద్యుత్ పరంగా తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే వీరు విధులు నిర్వర్తించనున్నా ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షణలోనే ఉంటారు. ఇక నాణ్యమైన విద్యుత్ సేవలు ఈ నియామకాలు జరిగాక జిల్లా అంతటా విద్యుత్ వినియోగదారులకు పూర్తి నాణ్యమైన సేవలు అందుతాయి. ఇంతవరకూ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒకేసారి ఇంతమంది ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకోవడం బహుశా ఇదే ప్రథమం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా వీడియో కవరేజ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. – చింతా సత్యనారాయణరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీ ఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం -
తండ్రి కాటికి.. తల్లి ఆసుపత్రికి..
సాక్షి,వేమనపల్లి(బెల్లంపల్లి): ఆదివారం సాయంత్రం సిరొంచలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, వరంగల్‌లో పట్టణాల్లో ఉండి చదువుకుంటున్న కూతురు సుష్మ, కుమారుడు ప్రణీత్‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. లైన్మెన్గా పనిచేస్తున్న వేమునూరి రమేశ్‌రెడ్డి మృతి చెందగా, ఆయన భార్య శారదను స్థానికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. దహన సంస్కారాలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నీల్వాయికి తరలించారు. శారద నడవలేని స్థితిలో ఉండి కూడా ఆసుపత్రి నుంచి భర్త కడచూపు కోసం నీల్వాయికి వచ్చింది. భర్త మృతదేహం పక్కనే గాయాలతో ఆమె కదల్లేని స్థితిలో విలపించడం పలువురిని కలచివేసింది. నిత్యం ఫోన్లో యోగక్షేమాలు తెలుసుకునే తమ తండ్రి ఇకలేడనే విషయం తెలిసిన చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న జనం గుండెలను పిండేశాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ప్రణీత్ తండ్రికి అంతిమ సంస్కారాలు చేశాడు. అనంతరం శారదను ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జెడ్పీటీసీ ఆర్.సంతోశ్‌కుమార్, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ కోళి వేణుమాధవ్, ఎంపీపీ కుర్రువెంకటేశ్, సర్పంచ్‌లు మల్లిక, కుబిడే వెంకటేశ్ తదితర నాయకులు, సహచర ఉద్యోగులు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. రమేశ్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఈ నాగేశ్వర్రావు తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
కోటగిరి(బాన్సువాడ) : మండలంలోని ఎత్తోండ గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ లైన్‌మన్ షేక్‌హసన్ (39) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తోండకు చెందిన షేక్‌హసన్ ప్రైవేటు కరెంటు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామంలో కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11 కే.వి. విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ ఆనంద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై పర్వేజ్ తెలిపారు. -
ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?
►రెండు సబ్స్టేషన్లకు ఒకే లైన్మెన్ ఒకే అసిస్టెంట్ ►విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం బేల : మండల విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని సబ్స్టేషన్ల తాలుకు పీఢర్ల పరిధిలో క్షేత్రస్థారుులో పనిచేసే సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా మండలంలోని రెండు సబ్స్టేషన్లకు ఒక లైన్మెన్, ఒక అసిస్టెంట్ లైన్మెన్ మాత్రమే ఉన్నారు. దీంతో విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఏళ్ల నుంచి బేల, జైనథ్ మండలాలకు అనుసంధానంగా విద్యుత్ శాఖలో ఒకే సెక్షన్ ఉండగా, ఎప్రిల్ నెలలో ఆ శాఖ చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో బేల మండలాన్ని ప్రత్యేక సెక్షన్‌గా ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఏఈ పోస్టు కేటారుుంచగా ఈ పోస్టు భర్తీ అరుుంది. మిగతా పోస్టులు కాలిగానే ఉనారుు. మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా కోసం మండల కేంద్రంతో పాటు చప్రాల గ్రామ శివారులో ఒక్కొక్క సబ్స్టేషన్లు ఉన్నారుు. దీంతో పాటు మండలంలోని తోయగూడ, సైద్పూర్, సాంగ్వి(జి) గ్రామ పంచాయతీల పరిధిలోని 20గ్రామాలకు సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. నియామకం ఇలా ఒక్కొక్క పీఢర్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిశీలన, బిల్లుల వసూలు కోసం ఒక లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్లను నియమిస్తారు. దీంతో పాటు విస్తీర్ణం అధికంగా ఉన్నట్లైతే అదనంగా మరో అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులలో ఎదైనా ఒక పోస్టు ఉంటుంది. పీఢర్ల సరఫరా ఇలా.. మండలంలోని అన్ని గ్రామాలకు ఏడు పీఢర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఇందులో మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో బేల టౌన్, సిర్సన్న, దహెగాం ఫీడర్ల పరిధిలో 25గ్రామాలు ఉన్నారుు. దీంతో పాటు చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలో చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్ల పరిధిలో 32గ్రామాలు ఉన్నారుు. ఇంతేకాకుండా మరోక సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా 20గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఖాళీల వివరాలు మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలోని బేల టౌన్ పీఢర్కు జూనియర్ లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పాటు దహెగాం, సిర్సన్న పీఢర్లలో ఒక లైన్‌మెన్‌తో పాటు అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలోని చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్లతో పాటు మరోక సైద్పూర్ పీఢర్కు ’బేల లైన్మెన్’యే ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీడర్ల పరిధిలో అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ఉన్న లైన్ ఇన్సపెక్టర్ ఇంఛార్జీగా కొనసాగుతారు. ఈ లైన్ ఇన్సపెక్టర్ స్థానికంగా ఉండకపోవడంతో, విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
భద్రత కరువే..!
► కార్మికులకు సేఫ్టీ టూల్స్ ఇవ్వని డిస్కం ► టెస్టర్ నుంచి కటింగ్బ్లేడ్ వరకు అన్ని ► కార్మికులే సమకూర్చుకుంటున్న వైనం ► నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కిందిస్థాయి లైన్మెన్లు, హెల్పర్లకు రక్షణ కరువైంది. ఆపరేషన్ విభాగంలో కీలకమైన విధులు నిర్వహించే కార్మికులకు కనీస భద్రత లేకుండా పోయింది. డిస్కం నిర్లక్ష్యానికి కార్మికులే కాదు సామాన్యులు సైతం సమిదలవుతున్నారు. గత మూడేళ్లలో సుమారు 250 మంది మృతి చెందగా, మరో 50 మంది క్షతగాత్రులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ సరఫరాను తెలుసుకునేందుకు అవసరమైన టెస్టర్ మొదలు..కటింగ్ బ్లేడ్ దాకా కార్మికులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికుల భద్రతకు అవసరమైన గౌ ్లజులు, బూట్లు, ఎర్త్రాడ్లు, సేప్టీబెల్ట్ ఇతర పరికరాలను ఆయా డిస్కమ్‌లే అందించాల్సి ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదని కాంట్రా క్ట్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. అస్తవ్యస్థంగా సరఫరా వ్యవస్థ పాతబస్తీతో పాటు నగరంలో పలుప్రాంతా ల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా తయారైంది. ట్రాన్స్ ఫార్మర్లకు కనీస రక్షణ లేదు. వీధుల్లోని విద్యుత్ పోల్స్‌కు సపోర్టింగ్‌గా ఏర్పాటు చేసిన వైర్లు ముట్టకుంటే షాక్ కొట్టుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏటా మే ఒకటి నుంచి ఏడు వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లు, సర్కిళ్ల పరిధిలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది. స్థానికంగా ఉన్న లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై అవగాహన కల్పించనున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► విధి నిర్వహణలో సేఫ్టీటూల్స్ను తప్పకుండా ఉపయోగించాలి. ► కాళ్లకు పాదర క్షలు, చేతికి గ్లౌజులు లేకుండా విద్యుత్ పరికరాన్ని ముట్టుకోరాదు. ► విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా ఎలాంటి మరమ్మతులు చేయకూడదు. ► టీవీ కేబుల్‌లో కూడా ఎర్త్ప్రసారం అవుతుంది. నోటి పళ్లతో వైర్లను కట్ చేయకూడదు. ► పోల్‌కు డబుల్ ఫీడర్ లైన్స్‌ను నిలిపివేసిన తర్వాతే స్తంభాన్ని ఎక్కాలి. ► విద్యుత్ స్తంభాలు ఎక్కేటప్పడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా..ప్రమాదం భారిన పడక తప్పదు. ► లైన్మెన్లు, హెల్పర్లు సేఫ్టీటూల్స్ ఉపయోగించాలి. ► ప్రమాదం జరిగితే వెంటనే 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలి. -
విద్యుత్ శాఖను వేధిస్తున్న లైన్మెన్ల కొరత
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా తగినంతమంది లైన్మెన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు వినియోగదారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో కొందరు అధికారులు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లచే పనులు చేయిస్తున్నారు. హైకోర్టులో పోస్టుల భర్తీ వ్యవహారం జిల్లాలో సూమారు 400 గ్రామాలకు జూనియర్ లైన్మెన్లు లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ విషయం హైకోర్టులో నలుగుతుంది. లైన్మెన్ పోస్టులు తమకు కేటాయించాలంటూ విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేరుగా నియామకాలు చేపట్టాలంటూ పలువురు నిరుద్యోగులు కూడా పిటిషన్లు వేశారు. దీంతో ఆ వ్యవహారం కోర్టులో నలుగుతోంది. అది తేలితే గాని పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన అంశం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.