విద్యుత్ శాఖను వేధిస్తున్న లైన్‌మెన్‌ల కొరత
Published Mon, Feb 10 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా తగినంతమంది లైన్‌మెన్‌లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు వినియోగదారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో కొందరు అధికారులు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లచే పనులు చేయిస్తున్నారు.
హైకోర్టులో పోస్టుల భర్తీ వ్యవహారం
జిల్లాలో సూమారు 400 గ్రామాలకు జూనియర్ లైన్‌మెన్‌లు లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ విషయం హైకోర్టులో నలుగుతుంది. లైన్‌మెన్ పోస్టులు తమకు కేటాయించాలంటూ విద్యుత్ సబ్‌స్టేషన్లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేరుగా నియామకాలు చేపట్టాలంటూ పలువురు నిరుద్యోగులు కూడా పిటిషన్లు వేశారు. దీంతో ఆ వ్యవహారం కోర్టులో నలుగుతోంది. అది తేలితే గాని పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన అంశం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement