అప్పుల్లో ‘కరెంట్‌’ | Telangana government On power sector | Sakshi
Sakshi News home page

అప్పుల్లో ‘కరెంట్‌’

Published Fri, Dec 22 2023 12:22 AM | Last Updated on Fri, Dec 22 2023 5:11 AM

Telangana government On power sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ సర్కారు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి రాష్ట్ర విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.20,856.12 కోట్ల మేర ఉండగా.. 2022–23 నాటికి రూ.78,553.92 కోట్లకు పెరిగాయని అందులో పేర్కొంది. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, బకాయిలు (లయబిలిటీస్‌) కలిపి రూ.37,081.64 కోట్లుకాగా.. 2022–23 నాటికి రూ.1,37,571.4 కోట్లకు చేరాయని వివరించింది. అంటే ఏకంగా రూ.1,00,489 కోట్లకుపైగా పెరిగినట్టు పేర్కొంది.

విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల్లో.. విద్యుదుత్పత్తి కోసం జెన్‌కో కొనుగోలు చేసిన బొగ్గు వ్యయం, డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన బిల్లుల వంటివి ఉంటాయి. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడినప్పుడు.. పలు అంశాలను విడివిడిగా వివరించారు. విద్యుత్‌శాఖ మొత్తం అప్పులు రూ.81,516 కోట్లు అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంలోని వివిధ శాఖలు/విభాగాలు విద్యుత్‌ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.28,842.72 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖలు బకాయిపడిన సొమ్ము రూ.720 కోట్లు. 

రూ.39,722 కోట్ల తాత్కాలిక విద్యుత్‌ కొనుగోళ్లు 
డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడం, స్థిరత్వం లేని పునరుత్పాదక విద్యుత్‌ లభ్యత వంటి కారణాలతో 2014–24(నవంబర్‌ 2023) మధ్య సగటున యూనిట్‌కు రూ.5.03 ధరతో 78,970 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌ నుంచి డిస్కంలు కొనుగోలు చేశాయి. ఇందుకు రూ.39,722 కోట్లను ఖర్చు చేశాయి. 

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ రాకున్నా రూ.638 కోట్ల కారిడార్‌ చార్జీలు 
ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ రావాలి. కానీ 2022 ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయింది. నిజానికి సర్కారు ఆదేశం మేరకు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోసం డిస్కంలు 2,000 మెగావాట్ల సామర్థ్యమున్న కారిడార్‌ను బుక్‌ చేశాయి. 2017–22 మధ్య పాక్షికంగానే ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సరఫరాకాగా.. పూర్తిస్థాయిలో 1,000 మెగావాట్ల కోసం కారిడార్‌ చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. కారిడార్‌ను ఉపయోగించకపోయినా 2020 అక్టోబర్‌ వరకు రూ.638.5 కోట్ల చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. సరఫరా అయిన విద్యుత్‌కు సంబంధించి మరో రూ.723 కోట్ల కారిడార్‌ చార్జీలను చెల్లించారు. 
 
పెరిగిన ఆస్తులు, నష్టాలు 
► తెలంగాణ ఆవిర్భావం నాటితో పోల్చితే రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) స్థిరాస్తుల విలువ రూ.12,783 కోట్ల నుంచి రూ.40,454 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో అప్పులు రూ.7,662 కోట్ల నుంచి రూ.32,797 కోట్లకు పెరిగాయి. అంటే ఆస్తులు 3.16 రెట్లు పెరగగా, అప్పులు 4.28 రెట్లు పెరిగాయి.

► తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు రూ.62,461 కోట్లుగా ఉన్నాయి. 2022–23లోనే రూ.11,103 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. 

► పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) వార్షిక రేటింగ్స్‌లో 2015–16లో ‘బీ+’గ్రేడ్‌లో ఉన్న డిస్కంలు.. 2021–22 నాటికి ‘సీ–’గ్రేడ్‌కు పడిపోయాయి. 
► రేటింగ్స్‌ నివేదిక ప్రకారం.. డిస్కంల నికర విలువ మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వాటి నికర విలువ ‘మైనస్‌ రూ.30,876 కోట్లు’. 

► వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు సంబంధించి డిస్కంలు సమర్పించిన అంచనాలతో పోల్చితే తెలంగాణ ఈఆర్సీ ఆమోదించిన అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీంతో డిస్కంలకు రావాల్సిన సబ్సిడీతో పోల్చితే ప్రభుత్వం తక్కువ సబ్సిడీ ఇచ్చింది. దీంతో డిస్కంలపై రూ.18,725 కోట్ల అదనపు భారం పడింది. 

► తెలంగాణ ఈఆర్సీ 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,550 కోట్ల మేర ట్రూఅప్‌ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతిచ్చింది. అయితే ఈ సొమ్మును తామే చెల్లిస్తామని, వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ చెల్లించలేదు. మరో రూ.2,378 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీ(ఎఫ్‌ఎస్‌ఏ)లనూ చెల్లించాల్సి ఉంది. 

► భద్రాద్రి థర్మల్‌ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఏడేళ్లు చేశారు. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. బొగ్గుగనులకు దూరంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్‌ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టడంతో బొగ్గు రవాణా అనవసర భారంగా మారనుంది. విద్యుత్‌ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులు తీవ్ర భారంగా మారనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement