‘యాదాద్రి’లో ఎందుకీ జాప్యం? | Deputy CM Bhatti Vikramarka Review With Power Department | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’లో ఎందుకీ జాప్యం?

Published Sat, Jan 13 2024 2:47 AM | Last Updated on Sat, Jan 13 2024 9:05 AM

Deputy CM Bhatti Vikramarka Review With Power Department - Sakshi

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీహెచ్‌ఈఎల్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్‌ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్‌ నాటికి 3 యూనిట్ల నిర్మాణం పూర్తి కావాలి. మొత్తంగా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలి. కానీ ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏమిటి? కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లు ఆహా్వనించకుండా..నామినేషన్‌ పద్ధతిలో బీహెచ్‌ఈఎల్‌కు పనులు ఎందుకు అప్పగించారంటూ’భట్టి ప్రశ్నించారు.

యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపై శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఇంధనశాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజారిజీ్వతో కలిసి బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. థర్మల్‌ కేంద్రం నిర్మాణానికి జెన్‌కో రూపొందించిన అంచనాలు, బీహెచ్‌ఈఎల్‌ కోట్‌ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్‌ఈఎల్‌తో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్‌ విలువ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధనశాఖ కార్యదర్శిని భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.34,500 కోట్ల అంచనాలతో యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి 2015 జూన్‌ 6న ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్‌ఆర్డర్‌ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్‌ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు ? అని ఆయన మండిపడ్డారు. ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. 

సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడమే కారణం: బీహెచ్‌ఈఎల్‌ 
రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన పనుల విలువ ఎంత అని భట్టి అడగ్గా.. రూ.20,444 కోట్లు విలువ చేసే పనులు బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారని, మిగిలిన పను లు జెన్‌కో, ఇతర సంస్థలు చేపట్టాయని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వివరించారు. తమకు ఇచి్చన పనుల్లో రూ.15,860 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేశామని, రూ.14,400 కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. రూ.1,167 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లింపులు ప్రతినెలా చేయలేదని, ఒక్క మార్చి(2023) నెలలోనే 91 శాతం చెల్లింపులు జరిపిందన్నారు.

నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము కూడా సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేకపోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదన్నారు. పర్యావరణానికి సంబంధించిన మరికొన్ని అనుమతులు ఏప్రిల్‌ 2024 నాటికి తీసుకొస్తే..సెప్టెంబర్‌ 2024 నాటికి రెండు యూనిట్లు, డిసెంబర్‌ 2024 లోగా మరో రెండు యూనిట్లు, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ను పూర్తిచేసి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో బీహెచ్‌ఈఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్‌ తజీందర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement