సాక్షి, బేల(అదిలాబాద్): ఓ ప్రైవేట్ లైన్‌మన్ విద్యుత్‌షాక్‌తో ఇటీవల చనిపోయిన ఘటనలో బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకుడొకరు ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి రూ.2.50లక్షలు వసూలు చేశాడని, ఇందుకు సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఒకరు సహకరించారన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు కూడా ‘పైసలుపాయే.. ఆపై కేసు నమోదాయే..’ అని చర్చించుకుంటున్నారు. వీరిచ్చిన రూ.2.50 లక్షలు చేతులు మారాయా..? మారితే ఎవరికి చేరాయి..? డబ్బులిచ్చినా కేసు ఎందుకు నమోదైంది..? అని ఆ శాఖలో తర్జనభర్జన నెలకొంది.
బేల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అంతర్రాష్ట్ర రోడ్డు పక్కన ఓ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు వచ్చింది. దీంతో గతనెల 17న చిన్న ట్రాన్స్‌ఫార్మర్ బిగింపు, మరమ్మతు చేసేందుకు ప్రైవేటు లైన్‌మన్ షేక్ అయ్యూబ్ (22)ను తీసుకొచ్చారు. ఆ సమయంలో విద్యుత్‌షాక్ తగిలి అయ్యూబ్ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం సమయంలో ఓ నాయకుడు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ కలిసి బాధిత కుటుంబం నుంచి పోలీసులకు ఆరుసార్లు ఫిర్యాదు రాయించారు. సంఘటనకు బాధ్యులైన అధికారులను కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ. 2.50లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ఇందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించాలని, మిగిలిన రూ. 50 వేలు కేసుల ఖర్చుల కోసమని నిర్ణయించుకున్నారు.
కేసు ప్రారంభంలో పోలీసులు ప్రమాదానికి విలేజ్ వర్కర్ (ఆదివాసీ యువకుడు) కనకే శ్యాం కారణమని పేర్కొంటూ కేసు నెట్టారు. దీంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కేసును తాత్కాలిక విలేజ్ వర్కర్‌పై నెట్టడమేంటని, అమాయకుడిని బలిచేస్తే ఊరుకోబోమని పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదివాసీ నాయకులను సముదాయించారు. ఇటీవల ఆ కేసు నుంచి విద్యుత్ అధికారులను తప్పించి.. విలేజ్ వర్కర్‌పై నెట్టడానికి డబ్బులు వసూలు చేసిన సదరు నాయకుడు ఓ మైనార్టీ నాయకుడితోపాటు బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై సాయన్న సమగ్ర విచారణ చేపట్టి గతనెల 26న ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులతోపాటు విలేజ్ వర్కర్‌ను రిమాండ్ చేశారు.
రిమాండ్ అయినవారిలో ఏఈ శంకర్, లైన్ ఇన్స్‌పెక్టర్ పవార్ సౌలా, జూనియర్ లైన్‌మన్ మనోహర్, విలేజ్ వర్కర్ కనకే శ్యాం ఉన్నారు. ఇలా ముగ్గురు అధికారులపై కేసు కావడంతో డివిజన్ పరిధిలోని విద్యుత్ బృందం తలాకొంత కలిపి ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలంటూ కేసులో మధ్యవర్తిత్వం వహించిన సబ్‌స్టేషన్ ఆపరేటర్‌తో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను సదరు ఆపరేటర్ నాయకుడికి ఇచ్చాడా..? ఒకవేళ నాయకుడికి ఇస్తే వెనక్కి ఎలా తీసుకోవాలి..? అని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. సదరు నాయకుడు అధికారపారీ్టకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరోవైపు బాధిత కుటుంబానికీ రూ.2లక్షలు ఇవ్వలేదని తెలిసింది. మొత్తం డబ్బులను ఆ నాయకుడే నొక్కేశాడా? ఆపరేటర్ నొక్కేశాడా..? తేలాల్సి ఉంద ని విద్యుత్‌శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment