భద్రత కరువే..!
► కార్మికులకు సేఫ్టీ టూల్స్ ఇవ్వని డిస్కం
► టెస్టర్ నుంచి కటింగ్‌బ్లేడ్ వరకు అన్ని
► కార్మికులే సమకూర్చుకుంటున్న వైనం
► నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కిందిస్థాయి లైన్‌మెన్‌లు, హెల్పర్లకు రక్షణ కరువైంది. ఆపరేషన్ విభాగంలో కీలకమైన విధులు నిర్వహించే కార్మికులకు కనీస భద్రత లేకుండా పోయింది. డిస్కం నిర్లక్ష్యానికి కార్మికులే కాదు సామాన్యులు సైతం సమిదలవుతున్నారు. గత మూడేళ్లలో సుమారు 250 మంది మృతి చెందగా, మరో 50 మంది క్షతగాత్రులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ సరఫరాను తెలుసుకునేందుకు అవసరమైన టెస్టర్ మొదలు..కటింగ్ బ్లేడ్ దాకా కార్మికులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికుల భద్రతకు అవసరమైన గౌ ్లజులు, బూట్లు, ఎర్త్‌రాడ్లు, సేప్టీబెల్ట్ ఇతర పరికరాలను ఆయా డిస్కమ్‌లే అందించాల్సి ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదని కాంట్రా క్ట్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు.
అస్తవ్యస్థంగా సరఫరా వ్యవస్థ
పాతబస్తీతో పాటు నగరంలో పలుప్రాంతా ల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా తయారైంది. ట్రాన్స్ ఫార్మర్లకు కనీస రక్షణ లేదు. వీధుల్లోని విద్యుత్ పోల్స్‌కు సపోర్టింగ్‌గా ఏర్పాటు చేసిన వైర్లు ముట్టకుంటే షాక్ కొట్టుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏటా మే ఒకటి నుంచి ఏడు వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లు, సర్కిళ్ల పరిధిలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది. స్థానికంగా ఉన్న లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అవగాహన కల్పించనున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
► విధి నిర్వహణలో సేఫ్టీటూల్స్‌ను తప్పకుండా ఉపయోగించాలి.
► కాళ్లకు పాదర క్షలు, చేతికి గ్లౌజులు లేకుండా విద్యుత్ పరికరాన్ని ముట్టుకోరాదు.
► విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా ఎలాంటి మరమ్మతులు చేయకూడదు.
► టీవీ కేబుల్లో కూడా ఎర్త్‌ప్రసారం అవుతుంది. నోటి పళ్లతో వైర్లను కట్ చేయకూడదు.
► పోల్‌కు డబుల్ ఫీడర్ లైన్స్‌ను నిలిపివేసిన తర్వాతే స్తంభాన్ని ఎక్కాలి.
► విద్యుత్ స్తంభాలు ఎక్కేటప్పడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా..ప్రమాదం భారిన పడక తప్పదు.
► లైన్‌మెన్లు, హెల్పర్లు సేఫ్టీటూల్స్ ఉపయోగించాలి.
► ప్రమాదం జరిగితే వెంటనే 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలి.