
సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయబోయే కొలువుల కోసం పోలీసుశాఖ క్షేత్రస్థాయి ఏర్పాట్లు మొదలుపెట్టింది. శిక్షణ సమయంలో గతేడాది ఉత్పన్నమైన మైదానాల కొరతతో పాటు ఇతర సమస్యలను ఈసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులున్నాయి. ఇందులో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుకు జనవరి 17 నాటికి శిక్షణ ప్రారంభమైంది. కానీ, దాదాపు 4 వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుళ్ల శిక్షణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈసారి అలాంటివి లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ముందుగానే పొరుగు రాష్ట్రాలపైన ఏపీ, కర్ణాటకతో సంప్రదింపులు మొదలుపెట్టింది.
మన వద్ద పరిస్థితి ఇదీ..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు శిక్షణ కోసం ఉన్న వనరులు కేవలం 6 వేల మందికి మాత్రమే సరిపోయేవి. కానీ, 2018 నోటిఫికేషన్ నాటికి వాటి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఏకంగా 12 వేలకుపైగా అభ్యర్థులకు ఒకేసారి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పోలీసుశాఖ సఫలీకృతమైంది. ఈసారి మైదానాలు, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్ణాటక, ఏపీతో సంప్రదింపులు జరుపుతున్నా.. ఏపీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఈసారి 20 వేల పోస్టుల నేపథ్యంలో ఎలాగైనా ఏపీని ముందే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment