సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో మాదాపూర్‌లోని నీరూస్ జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఇస్మాయిల్‌ను హత్య చేసిన జిలానీతో పాటు ముజాహిద్‌లు ఆదివారం రాత్రి 11.30 నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అక్రమ ఆయుధంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో సంచరించారు. కనీసం ఒక్క చోటైనా వాహనాల తనిఖీలు జరిగి ఉంటే నాటు పిస్టల్‌తో కారులో తిరుగుతున్న వీళ్లు పట్టుబడటమో, పోలీసుల భయంతో తమ పథకం అమలును వాయిదా వేయడమో చేసే వాళ్లు. ఇస్మాయిల్ ప్రాణాలు పోవడం వెనుక తనిఖీలు, సోదాలు గాయబ్ కావడమూ ఓ కారణంగానే కనిపిస్తోంది.
అటకెక్కిన ఆ విధానాలు..
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకప్పుడు విస్తృత స్థాయిలో తనిఖీలు, సోదాలు జరిగేవి. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో వాహనాల తనిఖీలో, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లే కనిపించేవి. ఫలితంగా అనేక మంది నేరగాళ్లు, అనుమానిత వ్యక్తులు, చోరీ.. సరైన పత్రాలు లేని వాహనాలు దొరుకుతుండేవి. గడిచిన కొన్నాళ్లుగా మాత్రం ఈ విధానాలన్నీ అటకెక్కాయి. ఎన్నికల సీజన్ లేదా సున్నితమైన పండగలు, ఇతర ఘట్టాలు ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్ల పైకి వస్తున్నారు. మిగిలిన రోజుల్లో కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. పగటి పూట పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం, రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. వీరి దృష్టి ఈ రెండు అంశాలపై కాకుండా మరో దానిపై ఉండట్లేదు.
చలాన్ కోసమో, మద్యం తాగాడా? లేదా? అనేది తనిఖీ చేయడానికో ఓ వాహనచోదకుడిని ఆపినప్పుడు వీళ్లు ఇతర అంశాలు పట్టించుకోరు. ఆ వాహనంలో అనుమానాస్పద, నిషేధిత వస్తువులు ఉన్నాయా? సదరు చోదకుడు వీటిని కలిగి ఉన్నాడా? తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం యాంత్రికంగా తమ పని పూర్తి చేసేస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఉన్న వారిలో అనేక మంది గతంలో శాంతిభద్రతల విభాగం, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన వాళ్లే. అయినప్పటికీ ఒంటిపైకి తెల్లచొక్కా వచ్చేసరికి అసలు పోలీసింగ్‌ను మర్చిపోతుంటారు. పగటిపూట రహదారుల్లో వాహన తనిఖీలు చేయడానికి ట్రాఫిక్ జామ్స్ సహా అనేక ఇబ్బందులు ఉంటాయి. అదే రాత్రి వేళల్లో వీటిని చేపట్టినా పెద్దగా ఇబ్బంది రాదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతర విభాగాల విధులతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించకుండా ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు తనిఖీలు, సోదాల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చదవండి: మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment