మంత్రాలయలో సిబ్బంది కొరత
26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీ ప్రక్రియ
ప్రస్తుతం కేవలం 40 మంది అటెండర్లు, బంట్రోతులు
భర్తీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తోందంటూ సామాన్య పరిపాలన విభాగంపై విమర్శలు
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్‌లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది.
1998కి ముందు 120 మంది...
ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్‌పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది.
ఇప్పుడైనా ఆమోదం లభించేనా?
ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్‌వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్‌వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్‌లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment