‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్‌సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి.
అమెరికా, యూరప్‌కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు.
ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే
చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు.
వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.
వాగ్నర్ VS అకాడమీ
ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్‌ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్‌లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే.
కంపెనీల స్వరూపం
ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి..
చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో!
► అకాడమీ:
బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి.
► వాగ్నర్ గ్రూప్
రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన యవ్‌జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి.
► జీఫోర్‌ఎస్
ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు.
► యూనివర్సల్ ప్రొటెక్షన్
అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు.
► కేబీఆర్
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment