
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు.
వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్‌మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు.
అలాగే ఖైర్సన్‌లోని క్లినిక్‌లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్‌ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు.
ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్‌ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment