సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీతారాంనాయక్, వేదికపై ఎంపీ దయాకర్, కలెక్టర్
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదలకు అందేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనంలో శనివారం నిర్వహించిన ‘దిశ’ సమావేశానికి ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాష్‌తోపాటు కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ హాజరయ్యారు. సీతారాంనాయక్ మాట్లాడుతూ.. వనరులతో కూడిన భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున కేంద్ర నుంచి వచ్చే నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. జాతీయ రోడ్ల విస్తరణతోపాటు మిగిలి ఉన్న రహదారుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. విద్యుత్ మీటర్లు లేని గ్రామాలను గుర్తించి దీన్‌దయాళ్ పథకంలో ప్రతి ఇంటింటికి కరెంట్ మీటర్ బిగించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆగస్టు చివరిలోగా తాగునీరందించాలని, పెండింగ్ ఉన్న ట్యాంక్‌లు, పైపులైన్ పనులు డిసెంబర్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలలో సరిపడా మందులు నిల్వ ఉంచుకొని రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
ఫసల్ బీమా యోజన పథకం రైతులకు వర్తించేలా అవసరమైన చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న చెక్కుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలంటే నెట్‌వర్క్ ముఖ్యమని, ఇందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు భూపాలపల్లిలో అధనంగా ఒక టవర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో హెడ్‌పోస్టాఫీస్ కార్యాలయ ఏర్పాటు కోసం తపాలశాఖ రాతపూర్వకంగా లేఖ ఇస్తే త్వరలో మంజూరు చేయిస్తానని చెప్పారు. పస్రాకు రూ.213 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు పనులను పూర్తి చేయాలని, భూపాలపల్లి నుంచి మహదేవపూర్ వరకు రూ.204 కోట్లతో మంజూరైన జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలన్నారు.
జిల్లా కేంద్రంలో ఎంపీ నిధుల నుంచి త్వరలో జింకల పార్కు, చిన్నపిల్లల పార్కు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపీ బండా ప్రకాష్ మాట్లాడుతూ గ్రామల వారీగా ప్రణాళికలు రూపొందించిన అర్హులైన ప్రతి పేదవారికి పథకాలు అందించాలని చెప్పారు. కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని, ఇందుకోసం సంబంధితశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సమావేశంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, డీఆర్‌డీఓ రవికిరణ్, సింగరేణి జీఎం గురువయ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ, సీపీఓ కొమురయ్య, అన్ని శాఖల అధికారులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment