సాక్షి, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పంచాయతీకలు 14 ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. నెలనెలా పంచాయతీలకు నిధులు ఇస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం ప్రకటించారు. అయితే నిధులతో పాటు అధికారులు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీనికోసం రోజువారీ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయడం, రోజూ వారీగా పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీపై ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉండబోతోంది.
నెలనెలా నిధులు
జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు సమస్యల వలయంలో ఉన్న జీపీలకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి నెలకు రూ. 339 కోట్లు కేటాయిస్తామని ప్రతిపాదించారు. దీంతో జిల్లాలోని 241 పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే సెప్టెంబర్ నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 3,59,16,700 తో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 2,40,62,400 నిధులను మొత్తంగా రూ. 5,99,79,100లను ఇటీవల ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇకపై ఇలాగే పంచాయతీలకు ప్రతీనెల నిధులు రానున్నాయి.
దీంతోఅన్ని పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్లు నిధుల లేకుండా సతమతమవుతున్న పంచాయతీలకు ఈనిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే 14 ఆర్థికసంఘం నిధులు వచ్చి ఉన్నా సర్పంచ్, ఉపసర్పంచ్ జాయంట్ చెక్ పవర్‌పై అభ్యంతరాలు, డిజిటల్ సైన్ విధానంతో కాలయాపన జరిగింది. ఇకపై నెలనెలా నిధులు రానుండడంతో పంచాయతీల అభివృద్ధికి నిధుల లోటుండదు.
ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్
30 రోజుల యాక్షన్ ప్లాన్‌లో అధికారుల అలసత్వానికి ఎలాంటి తావివ్వకుండా ఏరోజుకారోజు పనుల వివరాలను ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేసే వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో ప్రతీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల పురోగతిపై స్పష్టమైన వివరాలు వచ్చే వీలుంటుంది. ఈనెల 6 నుంచి ఇప్పటి వరకు ప్రతీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీల స్పెషల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతీరోజు కంప్యూటర్‌లో తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది.
గ్రామాల్లో యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఉన్నతాధికారులు ఏరోజైనా వీడియోకాల్ చేసే అవకాశం ఉంది. ఆరోజు కనుక పంచాయతీ అధికారులు ఆ గ్రామపంచాయతీ పరిధిలో లేనట్లయితే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం కూడా పూర్తయింది. తనిఖీల్లో పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.
ముమ్మరంగా యాక్షన్ ప్లాన్
జిల్లాలో 30 రోజుల యాక్షన్ ప్లాన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతీ గ్రామ పంచాయతీల్లోని పల్లెలను అభివృద్ధి బాట పట్టించే విధంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రతీ మండలానికి జిల్లాస్థాయి అధికారిని నియమించారు. దీంతో ప్రతీ గ్రామంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు, వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని మురుగునీటి వ్యవస్థను బాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment