సాక్షి, భూపాలపల్లి: ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలుగా పేరున్న భూపాలపల్లి, ములుగు తలసరి ఆదాయంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన వరంగల్ అర్బన్ జిల్లా కూడా భూపాలపల్లి, ములుగు జిల్లాల కంటే వెనుకబడే ఉంది. అయితే రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా కలిగిన జిల్లాల జాబితాలో మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాలు చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం.
ఈ ఆసక్తికరమైన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2019 బహిర్గతం చేసింది. ఇదే విధంగా గత సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో ఆహార భద్రతా కార్డుల సంఖ్య, ఎల్‌పీజీ కనెక్షన్లు పెరిగాయి. 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 1.80 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంటే 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2017–18లో మాత్రం 1.78 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంటే 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగుభూమితో పాటు నికర సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.
12వ స్థానంలో జిల్లా
తలసరి ఆదాయం విషయంలో ములుగుతో కలిసిన భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే 12 వస్థానంలో ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,80697 నుంచి రూ. 2,05,696కు పెరిగింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద రెండో సారి సవరించిన అంచనాల ప్రకారం 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల తలసరి ఆదాయం రూ.1,10,140 గా ఉంటే 2017–18లో రూ.1,24,612 పెరిగింది.
దాదాపు 13 శాతం పెరుగుదల నమోదైంది. తలసరి ఆదాయం విషయంలో జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలు ఉమ్మడి భూపాలపల్లి జిల్లా కంటే వెనుకబడే ఉన్నాయి. రెండు జిల్లాల్లో సింగరేణి, జెన్‌కో, వ్యవసాయ రంగాలే ప్రజలకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. సారవంతమైన గోదావరి పరీవాహక ప్రాంత భూములు ఉండడంతో మిగతా జిల్లాలతో పోలిస్తే పంట ఉత్పాదకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లాల్లో ఈ రంగాల్లో పనిచే స్తున్న కార్మికులు, రైతుల ఆదాయం ఇతర జిల్లాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అట్టడుగు స్థానాలు
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతోంది. రాష్ట్రంలో 38.9 శాతం దాటింది. అయితే భూపాలపల్లి, ములుగు జిల్లాలు మాత్రం పట్టణ జనాభాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లాల్లో ములుగు జిల్లా 33వ స్థానంలో ఉండగా నారాయణపేట జిల్లా 32, భూపాలపల్లి జిల్లా 31 స్థానాల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి జిల్లాలో మొత్తం జనాభా 4,16,763 ఉంటే పట్టణాల్లో నివసించే వారి సంఖ్య 42,387. ములుగు జిల్లాలో 2,94,671 జనాభా ఉంటే పట్టణ జనాభా 11,493. ములుగు, భూపాలపల్లి జిల్లాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉండడం రెండు జిల్లాల్లో కలిపి ఒక్కటే మునిసిపాలిటీ ఉండడం పట్టణ జనాభా తక్కువగా ఉండటానికి కారణంగా కనిపిస్తోంది.
పెరిగిన కనెక్షన్లు..
రెండు జిల్లాల్లో ఎల్‌పీజీ కనెక్షన్లు, ఆహారభద్రత కార్డుల సంఖ్య పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2019 వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి భూపాలపల్లి జిల్లాలో 20,7544 ఆహారభద్రత కార్డులు ఉంటే 2019 ఇప్పటి వరకు రెండు జిల్లాలో కలిపి 21,2553 ఆహారభద్రత కార్డులు పెరిగాయి. కొత్తగా 5,009 కుటుంబాలకు ఆహారభద్రతకార్డులు అందాయి. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో 90,345, భూపాలపల్లి జిల్లాలో 1,22,210 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఎల్‌పీజీ కనెక్షన్లు కూడా పెరిగాయి. 2017–18లో ములుగు,భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం 1,32,600 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 2018–19 నాటికి 1,74,241 కనెక్షన్లకు పెరిగాయి.
ఎక్కువ లింగనిష్పత్తి
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 988 కంటే ఎక్కువగా ఉండడం సంతోషకర విషయం. భూపాలపల్లి జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1004 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే ములుగులో 1015 మంది స్త్రీలు ఉన్నారు. అయితే 0–6 చిన్నారుల్లో లింగనిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. భూపాలపల్లి జిల్లాలో బాలబాలికల లింగనిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది బాలురకు 913 బాలికలు ఉన్నారు. ఈవిషయంలో ములుగు జిల్లా మెరుగ్గా ఉంది. వెయ్యి మంది బాలురకు 971 మంది బాలికలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment