
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో ఉంటున్న వెంకటేశ్వరరావుకు సింహాచలం లక్ష్మీ నర్సింహస్వామిపై ఎంతో గురి.. గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా పుట్టినరోజున కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి పూజ చేయించేవాడు. అలా చేయకపోతే.. ఆ ఏడాది పనులు సజావుగా సాగవని అతని నమ్మకం. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నందున పుట్టినరోజ నాడు ప్రతి ఏటా సింహాచలం వచ్చి పూజ చేయించడం సాధ్యం కాని పని. ఇలాంటి వారి కోసం రాష్ట్ర దేవదాయ శాఖ ఎన్నారై సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది.
ఎన్నారైలే కాదు.. దేశంలో ఎక్కడున్నా సరే.. మీపుట్టిన రోజు నాడో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే తమ ఇష్టదైవం ఆలయంలో పూజ, ఇతర సేవలు చేయించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుడు దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా.. వారి పేరిట కోరుకున్న తేదీన ఎంచుకున్న పూజను ఆలయ పూజారి జరిపిస్తారు. ఇందుకోసం అన్ని దేవాలయాల సేవల్ని ఒకచోట అందుబాటులోకి తెస్తూ.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపకల్పనకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో గుళ్లలోని వివిధ పూజల టికెట్ ధరకు అదనంగా కొంత మొత్తాన్ని సర్వీసు చార్జ్ రూపంలో వసూలు చేస్తారు. పూజ అనంతరం భక్తుడికి ప్రసాదం వంటివి పంపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment