Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.
మనోళ్లే ముందు
2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆ నగరాల్లోనే ఎక్కువ
కెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్‌మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.
చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్‌ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనత
వాణిజ్యంపై ప్రభావం
భారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్‌కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment