
ఐక్యరాజ్యసమితి: దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్ టెన్ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.
♦ 2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చిన 52 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తే, 2019కి ఆ సంఖ్య కొద్దిగా తగ్గి 51 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా 2010 నుంచి 2019 వరకు 0.4 శాతం మందికి భారత్ ఆశ్రయంకల్పిస్తూ నిలకడగా ఉంది.
♦ 207,000 మంది శరణార్థులకి మన దేశం ఆశ్రయమిస్తోంది. మన దేశంలో నివసిస్తోన్న అంతర్జాతీయ శరణార్థుల సంఖ్య 4 శాతం. ఇందులో మహిళా శరణార్థులు 48.8 శాతం. భారతదేశంలో ఆశ్రయంపొందుతోన్న శరణార్థుల్లో అత్యధిక మంది బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ నుంచి వచ్చినవారేనని ఈ రిపోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment