Indian diaspora
-
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.మనోళ్లే ముందు2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఆ నగరాల్లోనే ఎక్కువకెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనతవాణిజ్యంపై ప్రభావంభారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్‌లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్‌లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఆయన పారిస్‌కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్‌కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్‌కు తిరుగుపయనమవుతారు. -
కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమైంది. Immense enthusiasm in Sydney for the community programme, which begins soon… pic.twitter.com/K3193pYLEZ — PMO India (@PMOIndia) May 23, 2023 అనంతరం ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మోదీ మాట్లాడారు. తనతోపాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ ఆస్ట్రేలియా వస్తానని 2014లోనే వాగ్దానం ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇక్కడకు వచ్చానని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంచి స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం! భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయన్నారు. కామన్వెల్త్, కర్రీ, క్రికెట్ మన రెండు దేశాలను కలుపుతున్నాయని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియాలను కలిపి ఉంచే మరో బంధం యోగా.. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశంలో జరిగిందన్నారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఉందని ప్రధాని అన్నారు. Special connect between India and Australia... pic.twitter.com/JlMEhGv8sv — PMO India (@PMOIndia) May 23, 2023 ‘ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. త్వరలోనే బ్రిస్బెన్లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నాం. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కూడా మోదీతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ.. మోదీ ప్రజాదరణను ప్రముఖ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. ఆయన్ని అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని కూడా పిలుస్తారు. ‘నేను ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ను చూశాను. ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి కూడా లభించలేదు. ‘ప్రధాని మోదీ ది బాస్’ అని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు. An absolute delight connecting with the Indian diaspora at the community programme in Sydney! https://t.co/OC4P3VWRhi — Narendra Modi (@narendramodi) May 23, 2023 -
మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ
ఇండోర్: ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి ‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో–విజువల్, అక్షరరూపం నమోదు చేయాలి. శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యం జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం. మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్‌లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్‌లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతం. ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాం. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్ఐఆర్లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేశారు. దర్శన్ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్కు ప్రదానం చేశారు. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లోనే చదివా: గయానా అధ్యక్షుడు భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్‌లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు. -
అల్లు అర్జున్ హాజరైన ‘ఇండియా డే పరేడ్’కు 2 గిన్నిస్ రికార్డులు
వాషింగ్టన్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరిక, న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్‌గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐఏ వెబ్సైట్లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. గిన్నిస్ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రికార్డ్‌లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్‌లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్ఐఏ. మాడిసన్ అవెన్యూలో పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్‌గా గుర్తింపు లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన బన్నీ -
రిషి సునాక్ గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరువవుతోంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు ప్రధానికి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. రిషి సునాక్ ప్రధాని పదవిని అధిష్టించాలని యూకేలోని ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. రిషి సునాక్ వెనకబడ్డారని సర్వేలు వెల్లడించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రిషి సునాక్ సమర్థుడు కాబట్టే బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవాస భారతీయులు అంటున్నారు. ‘భారతీయ మూలాలు కలిగివున్నారు కాబట్టే మేము ఆయన కోసం ప్రార్థించడం లేదు. జీవన వ్యయ సంక్షోభం నుంచి మమ్మల్ని బయటపడేసే సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నాం కాబట్టే రిషి విజయం సాధించాలని కోరుకుంటున్నామ’ని బ్రిటిష్ ఇండియన్ సీకే నాయుడు తెలిపారు. ప్రధాని పదవికి ప్రస్తుతం రిషి సునాక్ ఉత్తమ అభ్యర్థి అని ప్రవాస భారతీయురాలు షీలమ్మ పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలతో పాటు ప్రతి విషయంలోనూ రిషి ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన గెలవాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలుతుంది. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూకే మొత్తం జనాభాలో 2.5 శాతంగా ఉన్న ప్రవాసులు జీడీపీలో దాదాపు 6 శాతం వాటా కలిగివున్నారు. గ్రాంట్ థోర్న్టన్ వార్షిక ట్రాకర్ 2022 ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే భారతీయ కంపెనీల సంఖ్య 805 నుంచి 900కి పెరిగింది. వీటి ద్వారా వచ్చే రాబడి 50.8 బిలియన్ల ఫౌండ్ల నుంచి 54.4 బిలియన్ ఫౌండ్లకు చేరుకుంది. ఇండియన్ డయాస్పోరా విజయాల్లో రిషి సునాక్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్: రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్) -
వారిని విడుదల చేయండి!
న్యూయార్క్: సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన 18మంది విద్యార్ధులను బేషరతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయ ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్‌డే సందర్భంగా బుధవారం వీరంతా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ 18 విద్యార్ధులను అక్రమంగా నిర్భంధించారని, వీరిపై అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రకటనలో కోరారు. ఈ 18మందిలో షర్జీల్ ఇమామ్ సహా 13మంది ముస్లింలున్నారు. ప్రకటనకర్తల్లో ఆస్ట్రేలియాలో ఎంపీగా ఎన్నికైన డేవిడ్ షోబ్రిడ్జి, ఆమ్నెస్టీకి చెందిన గోవింద్ ఆచార్య సహా పలు దేశాలకు చెందిన హక్కుల గ్రూపులు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, భారతీయ ముస్లింల అంతర్జాతీయ సమాఖ్య, దలిత్ సొలిడిటరీ ఫోరమ్ తదితరాలున్నాయి. -
ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!
ఐక్యరాజ్యసమితి: దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్ టెన్ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ♦ 2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చిన 52 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తే, 2019కి ఆ సంఖ్య కొద్దిగా తగ్గి 51 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా 2010 నుంచి 2019 వరకు 0.4 శాతం మందికి భారత్ ఆశ్రయంకల్పిస్తూ నిలకడగా ఉంది. ♦ 207,000 మంది శరణార్థులకి మన దేశం ఆశ్రయమిస్తోంది. మన దేశంలో నివసిస్తోన్న అంతర్జాతీయ శరణార్థుల సంఖ్య 4 శాతం. ఇందులో మహిళా శరణార్థులు 48.8 శాతం. భారతదేశంలో ఆశ్రయంపొందుతోన్న శరణార్థుల్లో అత్యధిక మంది బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ నుంచి వచ్చినవారేనని ఈ రిపోర్టు వెల్లడించింది. -
ఎటుచూసినా మనోళ్లే..
సాక్షి,ముంబయి: ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయులు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా వేర్వేరు దేశాల్లో కోటి 56 లక్షల మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారతి సంతతి వారు ఏకంగా 6 శాతంగా ఉన్నారు. అంతర్జాతీయ వలసదారుల సంఖ్య 2010 నుంచి పది శాతం పెరిగి 2015 నాటికి 24.3 కోట్లకు చేరిందని తాజాగా విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2015లో అంతర్జాతీయ వలసల్లో సగం మంది ఆసియా దేశాలకు చెందిన వారేనని ప్రపంచ వలస నివేదిక (2018) పేర్కొంది. వలసదారుల్లో భారత్ తర్వాతి స్ధానం మెక్సికోది కాగా, రష్యా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. ముఖ్యంగా 24 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న వారే వలసదారుల్లో అధికంగా 72 శాతం మేర ఉన్నారు. 1970 నుంచి అంతర్జాతీయ వలసలకు అమెరికానే గమ్యస్ధానంగా ఉంది. అమెరికా తర్వాత గల్ప్ దేశాలు భారత్ సంతతికి ప్రధాన కేంద్రంగా మారాయి. భారత సంతతిలో 22 శాతం మంది యూఏఈలో ఉన్నారు. -
ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు తమ గుర్తింపును ప్రవాస భారతీయ పౌరుడిగా మార్చుకునేందుకు గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. భారతీయ ప్రవాసులు ఓసీఐ కార్డు కోసం 31 డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది. 2017 డిసెంబరు 31 వ తేదీ వరకు పిఐఓ కార్డుదారుల ద్వారా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పత్రం సమర్పించాల్సిన తేదీని విస్తరించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఐ) కార్డులను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ (ప్రవాస భారతీయ పౌరులు) కార్డులను డిసెంబరు 31 వరకు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2015 నుంచి పీఐఓ కార్డులను రద్దు చేస్తూ ఆ కార్డులను కలిగి ఉన్నవాళ్లు వాటిని ఓసీఐ కార్డులుగా మార్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పిడికి విధించిన గడువును జూన్ 30 వరకు పెంచుతూ మార్చి 31న ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ గడువును కూడా డిశంబర్ 31 వరకు పొడిగించింది. కాగా జూన్ 30 లోపు గుర్తింపు కార్డుల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుందని భావించడం లేదని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఈ గడువును డిశంబర్ 31 వరకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ గడువులోపు తమ కార్డులను మార్చుకున్న వాళ్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి విదితమే. మరోవైపు ఈ మార్పును ప్రకటించినప్పటినుంచి గడువు పొడిగించడం ఇది నాలుగవ సారి. -
బ్రెగ్జిట్ ఎఫెక్ట్: సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పు?
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం అక్కడ ఉంటున్న భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. దాంతోపాటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కొంతవరకు ముప్పు తప్పదని అంటున్నారు. యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్‌లోకి వలసలు ఎక్కువయ్యాయన్న ఆందోళనే ‘బ్రెగ్జిట్’ నిర్ణయానికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే కారణంతో అక్కడున్న భారతీయులకు సైతం ముప్పు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన లోకనాథన్ గణేశన్ యూకేలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన కంపెనీ ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉండటంతో.. ఇప్పుడు తన ఉద్యోగం ఏమవుతుందో తెలియట్లేదని భయపడుతున్నారు. 2015లో బ్రిటిష్ వనితను పెళ్లాడి ఆయన బ్రిటన్‌కు వచ్చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉందని, పరిస్థితి ఇంతకుముందులా లేదని లీడ్స్ ప్రాంతంలో ఉండే గణేశన్ చెప్పారు. యూకేకు వలస రావాలన్న ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని తెలిపారు. యూరప్, బ్రిటన్లలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఐటీ కంపెనీల మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో అనిశ్చితి తప్పదని, యూకేలో తమ కార్యకలాపాలను మూసేసుకోవాలని ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయని తృప్తి పటేల్ అనే సాఫ్ట్వేర్ వాలిడేషన్ మేనేజర్ చెప్పారు. భారతదేశ ఐటీ ఎగుమతులలో 17 శాతం వరకు బ్రిటన్‌కే వెళ్తాయి. దాని విలువ దాదాపు రూ. 6.70 లక్షల కోట్లు!! ఇప్పుడు అక్కడి కంపెనీల కార్యకలాపాలు ఆగిపోతే.. మన సాఫ్ట్వేర్ పరిశ్రమ కూడా ఇబ్బంది పడక తప్పదని అంటున్నారు. -
మోదీ వస్తున్నారని.. రాత్రంతా నిద్రపోలేదు!
మొన్నటికి మొన్న అమెరికాలో ప్రవాస భారతీయులతో పాటు అక్కడున్న వాళ్లందరినీ తన ప్రసంగంతో, మాటల మ్యాజిక్‌తో ఉర్రూతలూగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ తన మ్యాజిక్ చూపిస్తున్నారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్ లోని ఆల్ఫోన్స్ ఎరెనా ప్రాంతంలో ఆయన కోసం ఓ మెగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దానికి ముందుగానే ప్రవాస భారతీయులలో మోదీ మానియా గట్టిగా కనిపించింది. సుమారు 20 వేల మంది వరకు ఉన్న భారతీయులు ఈ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, లోపల స్థలం సరిపోదన్న ఉద్దేశంతో ఎందుకైనా మంచిదని నిర్వాహకులు ముందుగానే బయట కూడా పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటుచేశారు. మోదీ వస్తున్నారని తెలిసి రాత్రంతా తనకు నిద్రపట్టలేదని, ఎప్పుడు ఆ కార్యక్రమం మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నానని ఓ క్యాబ్ కంపెనీ యజమాని నరీందర్ శర్మ అన్నారు. వేరే ప్రాంతాల నుంచి 'మోదీ ఎక్స్‌ప్రెస్' పేరుతో ప్రత్యేక రైళ్లు కూడా వచ్చాయి. ఆ రైళ్ల కోసం చాలామంది వచ్చినా, లోపల స్థలం సరిపోక మిస్సయ్యారు. సీటు దొరకనందుకు చాలా బాధపడ్డానని రంజన్ సింగ్ రాణా చెప్పారు. మెల్బోర్న్ వాసుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మెల్బోర్న్, ఇతర ప్రాంతాల నుంచి సిడ్నీకి విమానాల్లో కూడా చాలామంది బయల్దేరారు. బహుశా సిడ్నీలో ఇప్పటివరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరిగి ఉండదని అంటున్నారు. ఇప్పటివరకు మరే విదేశీ నేతకు ఇంత భారీ స్పందన లభించలేదు. ముందుగా ఇక్కడికొచ్చిన నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ ఫొటోలను మోదీ ట్విట్టర్లో కూడా షేర్ చేశారు. -
విడిపోవాలి.. లేదు కలిసుండాలి!
విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించిన స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావించాలన్న ఆకాంక్షను వెల్లడించడంతో విలవిల్లాడుతున్నారు. విడిపోవద్దంటూ స్కాట్లాండ్ వాసులను వేడుకుంటున్నారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు స్కాట్లాండ్ ప్రజలు సిద్దమయ్యారు. ఫలితం ఎలావున్నా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజనపై స్కాట్లాండ్ లోని ప్రవాస భారతీయులు రెండుగా విడిపోయారు. కొంతమంది సమైక్యానికే మద్దతు పలుకుతుంటే, మరికొందరు విడపోవడమే మేలంటున్నారు. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షను భారత సంతతి విద్యార్థిని జవిత నారంగ్ వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కావలసిన అన్ని అర్హతలు స్కాట్లాండ్ కు ఉన్నాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న జవిత అభిప్రాయపడింది. జవిత అభిప్రాయంతో అబర్డీన్ ఇండియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మొహువా బెనర్జీ విభేదించారు. బ్రిటన్ లో భాగంగా స్కాట్లాండ్ కొనసాగాలని తాను కోరుకుంటున్నానని మూడు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆమె పేర్కొన్నారు. ఏ దేశమైనా విడిపోతే బలహీనపడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మొహువా వాదనతో గ్లాస్కో బెంగాలీ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు షీలా బెనర్జీ ఏకీభవించారు. గ్లాస్కో ప్రాంతంలో ఉన్న బెంగాలీల్లో 99 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ విడిపోరాదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని బ్రిటన్ కు చెందిన సోషల్ వర్కర్ రిచా గ్రోవర్ కోరారు. బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా? అనేది స్కాట్లాండ్ ప్రజలు మరికొద్ది గంటల్లో నిర్ణయించనున్నారు.