మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ | Indian diaspora is country brand ambassador says PM Narendra Modi at Pravasi Bharatiya Divas | Sakshi
Sakshi News home page

మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ

Published Tue, Jan 10 2023 5:08 AM | Last Updated on Tue, Jan 10 2023 7:49 AM

Indian diaspora is country brand ambassador says PM Narendra Modi at Pravasi Bharatiya Divas - Sakshi

అతిథులనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

ఇండోర్‌: ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్‌ ఇర్ఫాన్‌ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...

ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి
‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్‌ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్‌ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్‌ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం

శుభపరిణామం.
భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో–విజువల్, అక్షరరూపం నమోదు చేయాలి.

శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యం  
జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్‌ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం.  

మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం  
ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్‌లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్‌లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్‌ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతం.

ఎన్‌ఆర్‌ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్‌ఆర్‌ఐలను కోరుతున్నాం. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్‌ఐఆర్‌లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేశారు.

దర్శన్‌ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్‌ అవార్డు  
విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్‌ సింగ్‌ దలీవాల్‌కు ప్రదానం చేశారు. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

భారత్‌లోనే చదివా: గయానా అధ్యక్షుడు
భారత్‌ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్‌లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్‌ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్‌ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement