‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్...
ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది.
పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది.
‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక.
మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే...
‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను.
అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్‌కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక.
మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది.
వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక.
మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్‌లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment