ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా... | Chef Madhusmita Soren Who Plays With Tribal Cuisine to Italian cuisine | Sakshi
Sakshi News home page

ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...

Published Wed, Dec 11 2024 1:46 AM | Last Updated on Wed, Dec 11 2024 1:46 AM

Chef Madhusmita Soren Who Plays With Tribal Cuisine to Italian cuisine

మధుస్మిత సోరెన్‌ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్‌. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్‌ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్‌ భంజ్‌ జిల్లా, రాయ్‌రంగపూర్‌ అమ్మాయి మధుస్మిత.

పోటీలో విజయం
ఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్‌ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్‌ షెఫ్‌’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 

తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్‌ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్‌డౌన్‌ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.

ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్‌లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్‌ షెఫ్‌ పోటీల్లో పాల్గొంది. ఆమె  చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్‌ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.

గవర్నమెంట్‌ ఉద్యోగం కంటే ఎక్కువ
‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత గవర్నమెంట్‌ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్‌ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.

ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్‌లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్‌ క్విజిన్‌’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్‌ ముర్ము.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement