ఇండియన్‌ రైల్వే నుంచి స్పేస్‌ఎక్స్‌ వరకు.. | Indian Railways to SpaceX Sanjeev Sharma LinkedIn profile viral | Sakshi
Sakshi News home page

స్పేస్‌ఎక్స్‌ ప్రయోగాల్లో భారతీయుడు.. ప్రొఫైల్‌ వైరల్‌

Published Wed, Oct 16 2024 5:26 PM | Last Updated on Wed, Oct 16 2024 6:16 PM

సంజీవ్‌ శర్మ

సంజీవ్‌ శర్మ

SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం​ అయింది. స్టార్‌ఫిష్‌ రాకెట్‌తో పాటు స్పేస్‌లోకి దూసుకెళ్లిన బూస్టర్‌ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్‌ రీసెర్చిలో అత్య​ద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్‌ టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్‌ ప్రొఫైల్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అంచెలంచెలుగా ఎదిగి..
శ్రీసాయి దత్తా అనే యూజర్‌ సంజీవ్‌ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఫ్రం ఇండియన్‌ రైల్వేస్‌ టు స్పేస్‌ఎ‍క్స్‌’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్‌ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్‌ఎ‍క్స్‌ సంస్థలో ప్రిన్సిపల్‌  ఇంజనీర్‌గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.

అమెరికాలో ఉన్న‌త విద్య‌
రూర్కీ ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీర్‌ చదువు పూర్తైన తర్వాత సంజీవ్‌ శర్మ 1990లో ఇండియన్‌ రైల్వేలో డివిజినల్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా ఆయన ప్రమోషన్‌ లభించింది. 2001 వరకు ఈ జాబ్‌లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్‌ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మరో మాస్టర్‌ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్‌ఎ‍క్స్‌ సంస్థలో స్ట్రక్చర్స్‌ గ్రూప్‌ డైనమిక్స్‌ ఇంజినీర్‌గా జాబ్‌ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్‌నెట్‌ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్‌ఎ‍క్స్‌కు తిరిగొచ్చారు. ‘బూస్టర్‌’ ప్రయోగం సక్సెస్‌ నేపథ్యంలో సంజీవ్‌ శర్మ  పేరు తాజాగా వెలుగులోకి  వచ్చింది.

ఓపిక అంటే ఇది..
ఇండియన్‌ రైల్వే నుంచి స్పేస్‌ఎక్స్‌ వరకు సాగిన సంజీవ్‌ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్‌ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్‌ఎక్స్‌లో చేరడానికి ముందు సంజీవ్‌ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్‌ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్‌ శర్మ ప్రమోషన్‌ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్‌ మెచ్చుకున్నారు. 

చ‌ద‌వండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement