ఇప్పటివరకూ అధికారుల పర్యవేక్షణలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇకనుంచి మహిళా సమాఖ్యలకు
కేజీబీవీల పగ్గాలు
ప్రతి నెలా రూ.1000
ఇవ్వాలని నిర్ణయం
పనితీరు ఆధారంగా సొమ్ము
పెంచే అవకాశం
పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్
భానుగుడి (కాకినాడ) : ఇప్పటివరకూ అధికారుల పర్యవేక్షణలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇకనుంచి మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. బడి మధ్యలో మానేసిన విద్యార్థినులకు, తల్లితండ్రులు వదిలేసిన వీధి బాలికలవంటివారికి విద్యాసుగంధాన్ని అందించేందుకు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, గంగవరం, వై.రామవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, కోటనందూరు, వీఆర్ పురం, ఎటపాక మండల కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. వీటిల్లో 2,282 మంది విద్యార్థినులు 6 నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. ఈ విద్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.6 కోట్లు వెచ్చిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండడంతో ఈ విద్యాలయాలను పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో వీటి పర్యవేక్షణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించాలని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల సభ్యులకు అధికారులతో శిక్షణ ఇస్తున్నారు. మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు, ప్రతి రోజూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.కేజీబీవీల నిర్వహణకు హేస్ట్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌ఎఎంఎస్ వెబ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ప్రతి కేజీబీవీలోనూ ఉదయం 8.30 గంటలకే విద్యార్థినుల హాజరు ఈ వెబ్‌సైట్లో నమోదు కావాలి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరంతా ఈ వెబ్‌సైట్ ద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవచ్చు. తద్వారా విద్యార్థినుల హాజరు శాతం పెంచవచ్చని అధికారులు అంటున్నారు.కేజీబీవీల పర్యవేక్షణకు సంబంధించి మహిళా సమాఖ్యకు ప్రతి నెలా రూ.1000 ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారు. మహిళా సంఘాల పనితీరు ఆధారంగా ఈ సొమ్ము పెంచే అవకాశాలున్నాయి.