కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక | Panchatantra plan in KGBV | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక

Nov 26 2023 5:34 AM | Updated on Nov 26 2023 5:02 PM

Panchatantra plan in KGBV - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవో­లు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈ­వోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉ­న్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపా­రు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. 

ప్రతి టీచర్‌ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా..
కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తు­తం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యా­ర్థులు 13,217 మంది, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు.

వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్‌ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఈసారి ఉత్తమ ఫలితా­లు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్‌ బంకర్‌ బెడ్లు అందించనున్నారు. 

ఉత్తమ ఫలితాలకు పురస్కారం 
గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మి­డియెట్‌ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్‌ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా ఇస్తాం. ఇంటర్‌లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement