intermediate public exams
-
కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవోలు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈవోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపారు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా.. కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులు 13,217 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్ బంకర్ బెడ్లు అందించనున్నారు. ఉత్తమ ఫలితాలకు పురస్కారం గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మిడియెట్ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా ఇస్తాం. ఇంటర్లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి -
నేలపైనే పరీక్ష
బుచ్చిరెడ్డిపాళెం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు విద్యార్థులకు పరీక్షగానే మారాయి. వసతుల లేమితో కింద కూర్చుని రాయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల కుమ్మక్కుతో పక్కపక్కనే నంబర్లు వేయడంతో పక్కా కాపీయింగ్ అవకాశమిచ్చే పరిస్థితి తలెత్తుతోంది. ఏడాది పాటు కష్టపడిన తమ పిల్లలు కింద కూర్చుని రాయాల్సి రావడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. బుధవారం డీఎల్ఎన్ఆర్ ఏ, బీ సెంటర్లలో పరిస్థితి ఇది. డీఎల్ఎన్ఆర్ కళాశాలలో పైఫ్లోర్ను ఏగా, కింద ఫ్లోర్‌ను బీగా కేటాయించారు. రెండు సెంటర్లలో చాలామంది విద్యార్థులు కింద కూర్చుని రాయాల్సి వచ్చింది. వరండాలో వేసి నంబర్లు పక్కపక్కనే ఉండటంతో కాపీయింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కింద కూర్చుని రాయాల్సి రావడంతో మానసిక ఒత్తిడికి గురై పరీక్ష సరిగా రాయలేదని కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడ్డారు. ఏ కేంద్రంలో 344 మంది విద్యార్థులను కేటాయించగా 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బీ సెంటర్లో 359 మందిని కేటాయించగా 19 మంది గైర్హాజరయ్యారు. సీ సెంటర్ బాలికల ఉన్నత పాఠశాలలో 316 మంది హాజరుకావాల్సి ఉండగా 17 మంది గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఆర్ఐఓ పరంధామయ్యను సంప్రదించగా కింద కూర్చున్న విషయం తన దృష్టికి వచ్చిందని, గురువారం పరీక్షకు కుర్చీలు వేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
ఇంకా సందిగ్ధంలోనే ఇంటర్ వివాదం!
* పరీక్షలపై సమావేశానికి వస్తానని చెప్పి రాని తెలంగాణ మంత్రి * మధ్యాహ్నం 12కు జరగాల్సిన భేటీ సాయంత్రానికి వాయిదా * అప్పటికీ రాకపోవడంతో వెనుదిరిగిన ఏపీ మంత్రి గంటా * అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేకపోయానన్న జగదీశ్ * రెండు మూడు రోజుల్లో మళ్లీ భేటీ ఉండే అవకాశం! సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతోంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల భేటీకి తెలంగాణ మంత్రి హాజరుకాకపోవడంతో సమావేశం వాయిదాపడింది. పరీక్షల షెడ్యూల్, ఉమ్మడి ప్రశ్నపత్రాలకు సంబంధించి ఇద్దరు మంత్రు లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశం కావలసి ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున సాయంత్రం నాలుగు గంటలకు భేటీకి వస్తారని సమాచారం రావడంతో మంత్రి గంటా బోర్డుకు వెళ్లకుండా ఆగిపోయారు. తిరిగి నాలుగు గంటలకు గంటా ఇంటర్ బోర్డుకు చేరుకుని దాదాపు గంటసేపు జగదీశ్వర్‌రెడ్డి కోసం ఎదురుచూశారు. అయితే తాను ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉన్నందున రాలేనని తెలంగాణ మంత్రి నుంచి ఫోన్ రావడంతో గంటా ఒకింత నిరాశకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం భేటీ?: గంటా ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి వెళ్లిపోతూ విలేకరులతో మాట్లాడారు. తమకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, ఉమ్మడి పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వమూ సహకరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. పరీక్షల తేదీల విషయంలోనూ తెలంగాణకు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని వివరించారు. కాగా, మంత్రుల భేటీ తిరిగి సోమవారం జరగవచ్చని అధికారవర్గాలు వివరించాయి. ఈలోపున మంత్రులు ఫోన్లో చర్చలు సాగిస్తే సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని, లేకపోతే సోమవారం వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. బోర్డు అధికారాల గురించి కాదు: గవర్నర్ దగ్గర బుధవారం ఇద్దరు మంత్రుల భేటీలో కేవలం ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే అంశంపైనే చర్చ జరిగిందని అంతకు ముందు మంత్రి గంటా సచివాలయంలో మీడియాతో పేర్కొన్నారు. బోర్డు అధికారాలను తెలంగాణకు కట్టబెట్టేందుకు కాదని స్పష్టంచేశారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఎవరి పరిధిలో ఉండాలో, ఏ విధంగా అవి కొనసాగాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని తాము కోరుతున్నామని వివరించారు. -
నేల రాతే
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: సమస్యలు.. అసౌకర్యాల నడుమ బుధవారం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బోర్డు చరిత్రలో తొలిసారిగా ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడంతో విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మొదలైంది. జిల్లాలో మొదటి రోజు మొత్తం 37,629 మంది విద్యార్థుల్లో 35,603 మంది పరీక్షకు హాజరయ్యారు. 8.45 నుంచి 9 గంటల మధ్య 86 మంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించారు. పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు తారుమారై విద్యార్థులు ఇబ్బందులకు లోనయ్యారు. కర్నూలులోని నారాయణ కళాశాలలో ఎంపీసీ చదివే షేక్అర్షియా సమ్రీన్ అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని మాస్టర్స్ కళాశాలలో పరీక్షకు హాజరయ్యారు. సెకండ్ లాంగ్వేజ్ అరబిక్ కాగా.. ఇన్విజిలేటర్ ఉర్దూ పేపర్ అందజేశారు. విషయాన్ని తెలియజేసినా ఇన్విజిలేటర్ నుంచి స్పందన లేకపోవడం ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఓఎంఆర్ షీట్లో ఒక సబ్జెక్టుకు బదులు మరొకటి రావడం కూడా విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నగరం మినహా ఇతర ప్రాంతాల్లోని కేంద్రాల్లో 60 శాతం విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాయాల్సి వచ్చింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే రూంలో 90 మంది విద్యార్థులచే పరీక్ష రాయించారు. బెంచీలు చిన్నవి కావడంతో పక్కపక్కనే కూర్చొని పరీక్ష రాసేందుకు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు పని చేసే మండలంలోనే డ్యూటీ వేయాలనే నిబంధనకు అధికారులు తిలోదకాలిచ్చారు. కర్నూలులోని కొన్ని కేంద్రాల్లో ఎస్జీటీలకు బదులు స్కూల్ అసిస్టెంట్లను నియమించడం గమనార్హం. ప్రశ్నపత్రంలో తప్పులుంటే వెంటనే తెలియజేయాలి ప్రశ్నపత్రాల్లో తప్పులుంటే విద్యార్థులు వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్ఐఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఇన్విజిలేటర్లు స్పందించకపోతే డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంటెండ్లకు తెలియజేయాలన్నారు. పశ్నపత్రం, ఓఎంఆర్ షీటులలో వివరాలను విద్యార్థులే సరిచూసుకోవాలన్నారు. ఏడాది కష్టం వృథా ఆలూరు, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన చాంద్‌బీ పరీక్ష రాయలేకపోయింది. అనుమతించాలని ఆలూరులోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ రంగన్నలను బతిమాలినా ఫలితం లేకపోయింది. ఏడాది కష్టం వృథా కావడంతో ఆ విద్యార్థిని కన్నీళ్ల పర్యంతమైంది. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి ప్రారంభం 99,466 మంది విద్యార్థులు..130 పరీక్ష కేంద్రాలు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి 9 గంటలు దాటిన తరువాత నో... ఎంట్రీ ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 99,466 మంది విద్యార్థులు హాజరుకానుండగా ఇందుకు 130 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. వీరిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 48,637 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 50,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం 8.00 గంటలకల్లా చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉదయం 8.30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 8.45 తరువాత వచ్చే వారు ఆలస్యానికి గల కారణం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. 9.00 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థులను సకాలంలో కేంద్రాలకు పంపించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మినహా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు మినహా ఇతరులెవ్వరూ సెల్ఫోన్లు కలిగి ఉండరాదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీసుకు పాల్పడి కఠిన చర్యలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే అందుకు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ల వసతి కల్పించామని చెప్పారు. ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ, విద్యార్థులను కేంద్రాలకు తరలించేందుకు ముఖ్యమైన రూట్లలో అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో వివిధ రకాల మందులను ఏఎన్ఎంల పర్యవేక్షణలో అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలు, కేంద్రాల్లో అవకతవకలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలు వుంటే పరీక్షలు జరిగే రోజుల్లో 0863-2222087 నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు.