జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 99,466 మంది విద్యార్థులు హాజరుకానుండగా ఇందుకు 130 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.
నేటి నుంచి ప్రారంభం
99,466 మంది విద్యార్థులు..130 పరీక్ష కేంద్రాలు
ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి
9 గంటలు దాటిన తరువాత నో... ఎంట్రీ
ఆర్‌ఐవో ఎం. రూఫస్‌కుమార్ వెల్లడి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్
జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 99,466 మంది విద్యార్థులు హాజరుకానుండగా ఇందుకు 130 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. వీరిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 48,637 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 50,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం 8.00 గంటలకల్లా చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో ఎం. రూఫస్‌కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
ఉదయం 8.30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 8.45 తరువాత వచ్చే వారు ఆలస్యానికి గల కారణం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. 9.00 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు.
విద్యార్థులను సకాలంలో కేంద్రాలకు పంపించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల్లోకి హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మినహా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు.
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు మినహా ఇతరులెవ్వరూ సెల్‌ఫోన్‌లు కలిగి ఉండరాదని స్పష్టం చేశారు.
మాల్ ప్రాక్టీసుకు పాల్పడి కఠిన చర్యలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే అందుకు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు బాధ్యత వహించాలన్నారు.
కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ల వసతి కల్పించామని చెప్పారు.
ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ, విద్యార్థులను కేంద్రాలకు తరలించేందుకు ముఖ్యమైన రూట్లలో అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
పరీక్ష కేంద్రాల పరిధిలో వివిధ రకాల మందులను ఏఎన్‌ఎంల పర్యవేక్షణలో అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.
పరీక్షలకు సంబంధించిన సమస్యలు, కేంద్రాల్లో అవకతవకలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.
ఏవైనా సమస్యలు వుంటే పరీక్షలు జరిగే రోజుల్లో 0863-2222087 నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు.