కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: సమస్యలు.. అసౌకర్యాల నడుమ బుధవారం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బోర్డు చరిత్రలో తొలిసారిగా ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడంతో విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మొదలైంది. జిల్లాలో మొదటి రోజు మొత్తం 37,629 మంది విద్యార్థుల్లో 35,603 మంది పరీక్షకు హాజరయ్యారు.
8.45 నుంచి 9 గంటల మధ్య 86 మంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించారు. పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు తారుమారై విద్యార్థులు ఇబ్బందులకు లోనయ్యారు. కర్నూలులోని నారాయణ కళాశాలలో ఎంపీసీ చదివే షేక్‌అర్షియా సమ్రీన్ అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని మాస్టర్స్ కళాశాలలో పరీక్షకు హాజరయ్యారు. సెకండ్ లాంగ్వేజ్ అరబిక్ కాగా.. ఇన్విజిలేటర్ ఉర్దూ పేపర్ అందజేశారు.
విషయాన్ని తెలియజేసినా ఇన్విజిలేటర్ నుంచి స్పందన లేకపోవడం ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఓఎంఆర్ షీట్‌లో ఒక సబ్జెక్టుకు బదులు మరొకటి రావడం కూడా విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నగరం మినహా ఇతర ప్రాంతాల్లోని కేంద్రాల్లో 60 శాతం విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాయాల్సి వచ్చింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే రూంలో 90 మంది విద్యార్థులచే పరీక్ష రాయించారు. బెంచీలు చిన్నవి కావడంతో పక్కపక్కనే కూర్చొని పరీక్ష రాసేందుకు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు పని చేసే మండలంలోనే డ్యూటీ వేయాలనే నిబంధనకు అధికారులు తిలోదకాలిచ్చారు. కర్నూలులోని కొన్ని కేంద్రాల్లో ఎస్జీటీలకు బదులు స్కూల్ అసిస్టెంట్లను నియమించడం గమనార్హం.
ప్రశ్నపత్రంలో తప్పులుంటే వెంటనే
తెలియజేయాలి
ప్రశ్నపత్రాల్లో తప్పులుంటే విద్యార్థులు వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్‌ఐఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఇన్విజిలేటర్లు స్పందించకపోతే డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంటెండ్లకు తెలియజేయాలన్నారు. పశ్నపత్రం, ఓఎంఆర్ షీటులలో వివరాలను విద్యార్థులే సరిచూసుకోవాలన్నారు.
ఏడాది కష్టం వృథా
ఆలూరు, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన చాంద్‌బీ పరీక్ష రాయలేకపోయింది. అనుమతించాలని ఆలూరులోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ రంగన్నలను బతిమాలినా ఫలితం లేకపోయింది. ఏడాది కష్టం వృథా కావడంతో ఆ విద్యార్థిని కన్నీళ్ల పర్యంతమైంది.
నేల రాతే
Published Thu, Mar 13 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement