బుచ్చిరెడ్డిపాళెం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు విద్యార్థులకు పరీక్షగానే మారాయి. వసతుల లేమితో కింద కూర్చుని రాయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల కుమ్మక్కుతో పక్కపక్కనే నంబర్లు వేయడంతో పక్కా కాపీయింగ్ అవకాశమిచ్చే పరిస్థితి తలెత్తుతోంది. ఏడాది పాటు కష్టపడిన తమ పిల్లలు కింద కూర్చుని రాయాల్సి రావడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. బుధవారం డీఎల్‌ఎన్‌ఆర్ ఏ, బీ సెంటర్లలో పరిస్థితి ఇది. డీఎల్‌ఎన్‌ఆర్ కళాశాలలో పైఫ్లోర్‌ను ఏగా, కింద ఫ్లోర్‌ను బీగా కేటాయించారు. రెండు సెంటర్లలో చాలామంది విద్యార్థులు కింద కూర్చుని రాయాల్సి వచ్చింది. వరండాలో వేసి నంబర్లు పక్కపక్కనే ఉండటంతో కాపీయింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
కింద కూర్చుని రాయాల్సి రావడంతో మానసిక ఒత్తిడికి గురై పరీక్ష సరిగా రాయలేదని కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడ్డారు. ఏ కేంద్రంలో 344 మంది విద్యార్థులను కేటాయించగా 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బీ సెంటర్లో 359 మందిని కేటాయించగా 19 మంది గైర్హాజరయ్యారు. సీ సెంటర్ బాలికల ఉన్నత పాఠశాలలో 316 మంది హాజరుకావాల్సి ఉండగా 17 మంది గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఆర్‌ఐఓ పరంధామయ్యను సంప్రదించగా కింద కూర్చున్న విషయం తన దృష్టికి వచ్చిందని, గురువారం పరీక్షకు కుర్చీలు వేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
నేలపైనే పరీక్ష
Published Thu, Mar 12 2015 1:57 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement