ఇంకా సందిగ్ధంలోనే ఇంటర్ వివాదం!
* పరీక్షలపై సమావేశానికి వస్తానని చెప్పి రాని తెలంగాణ మంత్రి
* మధ్యాహ్నం 12కు జరగాల్సిన భేటీ సాయంత్రానికి వాయిదా
* అప్పటికీ రాకపోవడంతో వెనుదిరిగిన ఏపీ మంత్రి గంటా
* అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేకపోయానన్న జగదీశ్
* రెండు మూడు రోజుల్లో మళ్లీ భేటీ ఉండే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతోంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల భేటీకి తెలంగాణ మంత్రి హాజరుకాకపోవడంతో సమావేశం వాయిదాపడింది. పరీక్షల షెడ్యూల్, ఉమ్మడి ప్రశ్నపత్రాలకు సంబంధించి ఇద్దరు మంత్రు లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశం కావలసి ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున సాయంత్రం నాలుగు గంటలకు భేటీకి వస్తారని సమాచారం రావడంతో మంత్రి గంటా బోర్డుకు వెళ్లకుండా ఆగిపోయారు. తిరిగి నాలుగు గంటలకు గంటా ఇంటర్ బోర్డుకు చేరుకుని దాదాపు గంటసేపు జగదీశ్వర్‌రెడ్డి కోసం ఎదురుచూశారు. అయితే తాను ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఉన్నందున రాలేనని తెలంగాణ మంత్రి నుంచి ఫోన్ రావడంతో గంటా ఒకింత నిరాశకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సోమవారం భేటీ?: గంటా ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి వెళ్లిపోతూ విలేకరులతో మాట్లాడారు. తమకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, ఉమ్మడి పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వమూ సహకరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. పరీక్షల తేదీల విషయంలోనూ తెలంగాణకు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని వివరించారు. కాగా, మంత్రుల భేటీ తిరిగి సోమవారం జరగవచ్చని అధికారవర్గాలు వివరించాయి. ఈలోపున మంత్రులు ఫోన్లో చర్చలు సాగిస్తే సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని, లేకపోతే సోమవారం వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొంటున్నాయి.
బోర్డు అధికారాల గురించి కాదు: గవర్నర్ దగ్గర బుధవారం ఇద్దరు మంత్రుల భేటీలో కేవలం ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే అంశంపైనే చర్చ జరిగిందని అంతకు ముందు మంత్రి గంటా సచివాలయంలో మీడియాతో పేర్కొన్నారు. బోర్డు అధికారాలను తెలంగాణకు కట్టబెట్టేందుకు కాదని స్పష్టంచేశారు. పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఎవరి పరిధిలో ఉండాలో, ఏ విధంగా అవి కొనసాగాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని తాము కోరుతున్నామని వివరించారు.