సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల వంటి నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో.. వాటి కట్టడి దిశగా కేంద్ర హోం శాఖ చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఏడేళ్ల క్రితం 24,206 మంది లైంగిక వేధింపులకు పాల్పడితే.. 2017లో 96,036 మంది లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి.
దీంతో ఈ తరహా నేరాలకు పాల్పడినవారి ఫొటోలు, వివరాలు, నమోదైన కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్’పేరిట డేటాబేస్‌ను ఏర్పాటు చేసి.. దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. తద్వారా లైంగిక నేరాలకు పాల్పడినవారిని సులువుగా గుర్తించడం, తగిన జాగ్రత్తలు చేపట్టడం వంటి చర్యల ద్వారా ఆయా నేరాలను నియంత్రించే అవకాశముందని భావిస్తోంది.
దేశవ్యాప్త వివరాలు ఒకే వెబ్‌సైట్‌లో..
దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలను ఒకేచోట పొందుపరచనున్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినవారి ఫొటోలతో సహా పూర్తి వివరాలు, వారిపై ఉన్న కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ నమోదు చేసి... దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
మారు మూల ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్ల నుంచి దేశవ్యాప్తంగా నేరస్తుల డేటా రూపొందించే సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టు వరకు అన్ని స్థాయిల్లో ఉపయోగించుకునేలా ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో సీఐడీ పరిధిలో పనిచేసే స్టేట్‌క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జిల్లాల్లో పనిచేసే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారులు నోడల్ అధికారులుగా పనిచేస్తారు.
జీవితాంతం జాబితాలో..
♦ తొలిసారి లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల వివరాలను 15 ఏళ్ల పాటు ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తారు. అదే విధంగా ఐపీసీ సెక్షన్లు 376, 354 (ఏ, బీ, సీ, డీ), 377 పరిధిలోని నేరాలకు పాల్పడినవారి వివరాలను కూడా 15 ఏళ్లపాటు నిక్షిప్తం చేస్తారు. పదే పదే లైంగిక వేధింపులు, అత్యాచార నేరాలకు పాల్పడినవారి వివరాలను 25 ఏళ్లపాటు డేటాబేస్‌లో ఉంచుతారు.
♦ ఇక ఐపీసీ సెక్షన్లు 376 (1), (3,4,5,6) పరిధిలోని నేరాలు, ట్రాఫికింగ్ నేరాలు, 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలపై వేధింపుల (పోస్కో యాక్ట్ పరిధిలోని నేరాలు)కు పాల్పడేవారి డేటాను 25 ఏళ్ల పాటు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఒకవేళ వీరు తిరిగి నేరాలకు పాల్పడితే వారి జీవితాంతం వివరాలు డేటాబేస్‌లో ఉండిపోతాయి.
♦ తరచూ నేరాలు చేసేవారు (హ్యాబిచువల్ అఫెండర్స్), కిరాతకమైన అత్యాచారాలు, గ్యాంగ్‌రేపులు, కస్టోడియల్ రేపులు, రేప్ అండ్ మర్డర్ కేసులు నమోదైన వారి వివరాలను వారి జీవితాంతం వెబ్‌సైట్లో ఉంచుతారు.
కేసు కొట్టివేస్తే.. తొలగింపు
లైంగిక వేధింపులు, అత్యాచార కేసులను కోర్టులు కొట్టివేస్తే.. ఆయా కేసుల్లోని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. కోర్టు నుంచి వచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి నోడల్ అధికారులు ఈ వివరాలను తొలగిస్తారు. అయితే పదేపదే నేరాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం పేర్లను జాబితా నుంచి తొలగించరు.
నిఘాతో నియంత్రణ...
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులో ఉండటం వల్ల.. వారిపై నిఘా పెట్టడం, మళ్లీ నేరాలు చేయకుండా నియంత్రించడం సులువు అవుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అంతేగాకుండా ఈ నేరస్తుల జాబితాను అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు కూడా అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది.
ఇక నిందితులపై అత్యాచారాల, వేధింపుల షీట్స్ తెరవాలని కూడా నిర్ణయించింది. అనుమానితుల ఫొటోలను స్కాన్ చేసి.. జాబితాలో ఉంటే గుర్తించేలా ‘ఫేస్ రికగ్నిషన్’సాంకేతికతను కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌కు కూడా ఈ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసి.. నిందితుల వేలిముద్రలనూ నిక్షిప్తం చేయనున్నారు.
దీనివల్ల జాబితాలో ఉన్నవారు దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ నేరాలకు పాల్పడినా వెంటనే గుర్తించేందుకు అవకాశం లభించనుంది. అయితే ఈ జాబితాలో నేరం రుజువై శిక్షపడిన వారి వివరాలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దర్యాప్తు విభాగాలకు మాత్రం వారిపై ఎఫ్‌ఐఆర్ అయినప్పటి నుంచి ప్రతి వివరాలూ అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment