'నేనే సీఎం అయితే వెంటనే రాజీనామా చేస్తా'
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్లక్ష్యధోరణి వల్లే 29 మంది భక్తులు మృతి చెందారని మాజీ మంత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకుడు బొత్ససత్యనారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం ఒక కార్యక్రమంలో పుష్కరాల సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే వెంటనే రాజీనామా చేసేవాడినన్నారు.
పబ్లిసిటీ కోసం కటౌట్లు పెట్టి ఆర్భాటాలు చేశారేతప్పా, ప్రజల కోసం ఏ పనీ చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రూ. 1600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ప్రకటించిన చంద్రబాబు భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం డాక్టర్ కాని నర్సు కాని కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. తాగటానికి భక్తులకు మంచినీరు సదుపాయం కూడా కల్పించలేదని ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఘటన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.