మహా పాపం | 27 killed in Godavari puskaras at Rajamandry puskara ghat | Sakshi
Sakshi News home page

మహా పాపం

Published Wed, Jul 15 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

27 killed in Godavari puskaras at Rajamandry puskara ghat

* పుణ్య పుష్కరాల్లో ఏపీ సర్కారు నిర్వాకం.. పుష్కరాల తొలిరోజే పెను విషాదం
* రాజమండ్రి పుష్కర ఘాట్‌లో భారీ తొక్కిసలాట, 27మంది మృతి
* 200 మందికి గాయాలు, మృతుల్లో 24 మంది మహిళలే

* రాజమండ్రి పుష్కరఘాట్‌కు లక్షలాదిగా పోటెత్తిన భక్తులు
* లఘు ప్రచార చిత్రం కోసం సామాన్యుల ఘాట్‌కు వచ్చిన బాబు
* ఏపీ సీఎం కోసం రెండు గేట్లు మూసివేత
* ఉదయం 4 గం॥నుంచి 8.20 వరకూ భక్తులకు అనుమతి నిరాకరణ
* చంద్రబాబు వెళ్లాక ఒక గేటు ఒకవైపు తెరిచిన వైనం
* దీంతో ఒక్కసారిగా తోసుకెళ్లిన భక్తులు
* రెండు గంటలపాటు తొక్కిసలాట

 
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల తొలిరోజే మహావిషాదం... పుష్కరాల చరిత్రలో మునుపెన్నడూ జరగని ఘోర దుర్ఘటన... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారయావకు 27మంది పుష్కర భక్తులు బలయ్యారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం... బారికేడ్లు, మంచినీరులాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం... జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రచారం, లఘు చిత్రంలో నటిం చడం మీదనే దృష్టిపెట్టడం... గంటల తరబడి నిరీక్షిస్తున్న లక్షలాది భక్తులకు ఒక్కసారిగా గేట్లు తెరవడం... పెనువిషాదానికి దారి తీసింది.
 
 రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి కుంభమేళాను మించిన స్థాయిలో నిర్వహిస్తామన్న ప్రచారార్భాటమే తప్ప కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం ఉదయం జరి గిన తొక్కిసలాట భక్తుల ప్రాణాలను బలితీసుకుంది. లఘు ప్రచార చిత్రంలో ప్రజలు భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో సీఎం వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం చేయకుండా సామా న్య భక్తుల ఘాట్‌కు రావడంతో భక్తులు నాలుగైదు గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం కుటుంబం వెళ్లిపోగానే ఒక్కసారిగా గేట్లు తెరవడంతో... తెల్లవారుజాము నుంచీ వేచి ఉన్న ప్రజలు ఒక్కసారిగా తోసుకురావడంతో జరిగిన తొక్కిసలాట 27 మంది అమాయక ప్రాణాలను బలితీసుకుంది. మరో 200 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. చనిపోయినవారిలో 24 మంది మహిళలే ఉన్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం ఉదయం పుష్కర స్నానాలు ప్రారంభంలోనే జరిగిన తొక్కిసలాటలతో రెండు గంటలపాటు పుష్కరఘాట్ భక్తుల ఆర్తనాదాలు, ఆవేదనలు, ఆక్రందనలతో మార్మోగింది. తొక్కిసలాటతో ఊపిరాడక కొందరు, మంచినీళ్లు అందక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు మృతదేహాలుండగానే మరోవైపు తొక్కిసలాట జరి గింది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడం మినహా భక్తులను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. రెండుగంటల తర్వాత గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
 
 సీఎం కోసం గేట్లు మూసేశారు
 పుష్కరాల ప్రారంభ ఘడియల్లోనే పుష్కరస్నానం చేయాలని లక్షలాదిమంది భక్తులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కోటగుమ్మం సెంటర్ ఘాట్‌కు చేరుకున్నారు. కానీ సీఎం కుటుంబం పుష్కర స్నానం చేశాకనే ప్రజలను అనుమతిస్తామంటూ అధికారులు గేట్లు తెరవలేదు. అప్పటికే ఘాట్ బయట కోటగుమ్మం సెంటర్ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే పుష్కరాలకోసం తీసే ఓ లఘుచిత్రంలో భారీగా ప్రజలు కనిపించాలన్న ఉద్దేశంతో ఆయన ఉదయం 5.45 గంటలకు కుటుంబ సమేతంగా సామాన్య ప్రజలకోసం కేటాయించిన పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ లఘుచిత్రం యత్నాలు, పిండప్రదానాలు, పూజా కార్యక్రమాలు పూర్తయ్యేసరికి 8.20 గంటలైంది.
 
భద్రతా కారణాలంటూ అప్పటివరకూ భక్తులను ఘాట్‌లోకి అనుమతించలేదు. 8.20 గంటలకు ముఖ్యమంత్రి పుష్కరఘాట్‌నుంచి బయటకు వచ్చి ప్రత్యేక బస్సులోకి వెళ్లారు. అప్పుడు పోలీసులు మొదటి గేటును కొద్దిగా తెరిచారు. తెల్లవారుఝామునుంచీ ఎదురుచూస్తున్న భక్తులు ఒక్కసారిగా తోసుకుని లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. గేటుకు రెండువైపులా నలుగురైదుగురు పోలీసులున్నా వారు భక్తులను నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట మొదలైంది. గేటువద్ద ఒక కుప్పలాగా కొందరు పడిపోయారు. వారిని బయటకు లాగేందుకు కొందరు ప్రయత్నించినా బయటినుంచి జనం తోసుకొచ్చేస్తుండటంతో సాధ్యం కాలేదు. మరోవైపు తొక్కిసలాట జరుగుతూనే ఉంది. మరికొందరు పడిపోతూనే ఉన్నారు. ఈ తొక్కిసలాటను ఆపేందుకు పోలీసులు ముందుకు రాకపోగా తామేం చేయలేమని చేతులెత్తేశారు.
 
 చివరకు స్నానం చేసేందుకు అప్పటికే లోనికెళ్లిన కొందరు యువకులు, ఆక్టోపస్ పోలీసులు కుప్పగా పడి ఉన్న భక్తులను కాపాడేందుకు ముందుకు వచ్చారు. మీకేం సంబంధం, మీరెందుకు వచ్చారంటూ సివిల్ పోలీసులు వారిని అడ్డగించి కొట్టారు. అయినప్పటికీ వారు పట్టువిడవకుండా కొందరిని ఘాట్ లోపలికి, కొందరిని ఘాట్ బయటకు లాగారు. వారిలో కొందరు అప్పటికే ప్రాణాలు కోల్పోగా... కొందరిలో చలనం కనిపించలేదు. తొక్కిసలాటతో ఊపిరాడక, మంచినీళ్లు అందక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు.  స్పృహ కోల్పోయిన వారికి అందించేందుకు మంచినీళ్లు కూడా కరువయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అదనపు డీజీ ఆర్‌పీ ఠాకూర్, ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని రెండు గేట్లను పూర్తిగా తెరిచి కొంతమంది పోలీసులను రంగంలోకి దింపారు. ఆ సమయంలోనూ భక్తులను నియంత్రించడం సాధ్యం కాకపోగా డీఐజీ హరికుమార్ చొక్కా చిరిగిపోయింది. రెండుగంటలపాటు ఇదే విధమైన పరిస్థితి కొనసాగింది. ఎట్టకేలకు 10:30 గంటలకు కొంతవరకూ భక్తులను అదుపు చేయగలిగారు. ఆ తర్వాత ఘాట్ లోపల, బయట ఉన్న మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో రెండో గేటు వద్ద తొక్కిసలాట మొదలైంది. మరికొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత వారిని ఆంబులెన్సుల్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
 
 దుర్ఘటనకు కారణాలివీ?
 1.    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానమాచరించడానికి భక్తులను ఉదయం 4 గంటల నుంచి 8.20 వరకు ఆపేయడం.
 2.    వీఐపీ ఘాట్‌లో కాకుండా లఘుచిత్రం చిత్రీకరణ కోసం సీఎం పుష్కరఘాట్ లోస్నానం చేయడం.
 3.    జాతీయ, అంతర్జాతీయ చానళ్లల్లో జనసందోహం భారీగా కనిపించేందుకు భక్తులందరినీ పుష్కరఘాట్‌కు మళ్లించడం.
 4.    భక్తుల భద్రత గాలికొదిలేసి ఉన్నతాధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది సీఎం కోసం పనిచేయడం.
 5.    ప్రజల్ని ఇతర ఘాట్‌లకు వెళ్లేలా అప్రమత్తం చేసేందుకు నియమించిన ప్రైవేటు కాంట్రాక్టరు చేతులెత్తేయడం.
 6.    మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు బారికేడ్ల పొడవును తగ్గించడం.
 7.    దుర్ఘటన ప్రాంతంలో ప్రాథమిక చికిత్స సౌకర్యం, మంచినీరు, అంబులెన్సు, సహాయక సిబ్బంది లేకపోవడం.
 8.    భారీ ఉత్సవాలు, వేడుకలు జరగడానికి ముందు చేయాల్సిన కసరత్తు (రిహార్సల్స్, మాబ్ మేనేజ్‌మెంట్) లోపించడం.
 
లక్షల మందిని వదిలి సీఎంకే ప్రాధాన్యం
 పుష్కరాల బందోబస్తుకోసం రాజమండ్రిలో 22వేల మందికి పైగా పోలీసులను దింపినా పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి వారికి డ్యూటీలు వేయలేదు. చంద్రబాబు పర్యటనకు మాత్రమే పోలీసులను ఎక్కువగా ఉపయోగిస్తూ మిగిలిన వారిని తర్వాత డ్యూటీలు వేస్తామని చెప్పారు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉండడంతో రైళ్లలో దిగిన వారంతా కోటిలింగాల ఘాట్‌లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో లక్షలాది మంది జనం గోదావరి స్టేషన్ నుంచి పుష్కరఘాట్ ఉన్న కోటగుమ్మం సెంటర్‌వరకూ నిలబడ్డారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కోటిలింగాల ఘాట్, సమీపంలోని ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నా భక్తులను అటువైపు మళ్లించేందుకు అక్కడ అధికారులెవ్వరూలేరు. మరోవైపు వీఐపీలు స్నానం చేయాల్సిన సరస్వతిఘాట్‌ను వదిలి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు సామాన్యభక్తులకు కేటాయించిన కోటిలింగాల ఘాట్‌కు వచ్చారు. వారికోసం తెల్లవారుజాము నాలుగు గంటలనుంచి ఉదయం 8.20 గంటలవరకూ ఆ ఘాట్‌లోకి ఎవ్వరినీ అడుగుపెట్టనీయలేదు.
 
 లక్షల మంది జనం ఉన్నచోటుకు సీఎం, ఆయన కుమారుడి కోసం రెండు బస్సులు, కాన్వాయ్‌ను అనుమతించారు. దీంతో వచ్చిన భక్తులు కోటిలింగాల ఘాట్‌కు వెళ్లే మార్గం మూసుకుపోయింది. భక్తులను నియంత్రించడం పోలీసులకు కష్టమైపోయింది. పుష్కరఘాట్‌లో దాదాపు మూడు గంటలు గడిపాక ముఖ్యమంత్రి వెళ్లిపోగానే ఆయనకు భద్రతగా వచ్చిన పోలీసులు కూడా పక్కకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట మొదలై 27మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆక్టోపస్ ఇతర విభాగాలు, తమిళనాడు పోలీసులున్నా వారికి భాష అర్థంకాక ఏమీ చేయలేకపోయారు. తొక్కిసలాట తర్వాత మంచినీళ్లు కూడా అందకపోవడంవల్ల కొందరు మృతి చెందారు. మరోవైపు ఘాట్ల వద్ద అనారోగ్యంతో ముగ్గురు మృతిచెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement